గత వారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా తదితర దేశాధినేతలంతా హాజరయ్యారు. అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు, సౌతాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాకు అనారోగ్యానికి గురైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రిక్స్ నుంచి వచ్చాక అధ్యక్షుడు రామఫోసా విశ్రాంతి తీసుకుంటున్నారని సౌతాఫ్రికా అధ్యక్ష భవనం ఇప్పటికే తెలిపింది.
అయితే ఈ ప్రకటనను ఆసరాగా చేసుకుని చాలా మంది సోషల్ మీడియాలో బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులు అస్వస్థతకు గురైనట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఈ వార్తలన్నీ నకిలీ వార్తలుగా కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని హెచ్చరించింది. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఈ వార్తలు కేవలం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా సదస్సు ముగిసిన తర్వాత బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో తెరపైకి వచ్చాయి. అయితే రామఫోసా అనారోగ్యంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. 73 ఏళ్ల రామఫోసా సెప్టెంబర్ 14న న్యూఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు దక్షిణాఫ్రికా ప్రెసిడెన్సీ సెప్టెంబర్ 16న తెలిపింది. బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితిలో, సాధ్యమైన చోట్ల ఆయా కార్యక్రమాలకు సంబంధిత మంత్రులు తన తరఫున హాజరుకావాలని రామఫోసా కోరినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే రామఫోసా అనారోగ్యానికి BRICS సదస్సుతో సంబంధం ఉందని అధికారికంగా ఎలాంటి ఆధారాలు వెల్లడికాలేదు. దీనికి విరుద్ధంగా పలువురు ప్రపంచ నేతలు అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ ఫేక్‌గా పేర్కొంది.
దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాల్ మషటిలే కూడా ఇటీవల ఓ చిన్న వైద్య ప్రక్రియ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు తాను విశ్రాంతి తీసుకుంటున్నట్లు సెప్టెంబర్ 15న ఆయన తెలిపారు. అయితే తన కార్యాలయంలోని బృందం, ప్రభుత్వంలోని ఇతర అధికారులు పనులను కొనసాగిస్తున్నారని వెల్లడించారు. దీంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ ఒకేసారి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
రామఫోసా సెప్టెంబర్ 11న న్యూఢిల్లీకి చేరుకుని 12, 13 తేదీల్లో జరిగిన 18వ BRICS సదస్సులో పాల్గొన్నారు. BRICS సమావేశాల్లో ఆయన ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, బహుపాక్షిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర అంశాలపై ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్న సందర్భంగా రామఫోసా భారత్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
తప్పుడు ప్రచారంపై కేంద్రం హెచ్చరిక
BRICS సదస్సు తర్వాత పలువురు ప్రపంచ నాయకులు అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తున్న వార్తలను MEA ఖండించడంతో ఈ అంశంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. ఒక దేశాధ్యక్షుడు అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారనే అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, పలువురు నేతల ఆరోగ్యంపై నిర్ధారణ లేని కథనాలు ప్రచారం చేయడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది.

