NTV Telugu Site icon

Brain-Eating Amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో ఐదేళ్ల బాలిక మృతి..

Pam

Pam

Brain-Eating Amoeba: అత్యంత అరుదైన ‘‘నైగ్లేరియా ఫౌలేరీ’’ అమీబా వల్ల ఐదేళ్ల బాలిక మరణించింది. సాధారణంగా ‘‘మెదడును తినే అమీబా’’గా కూడా పిలిచే ఈ ఇన్ఫెక్షన్ వల్ల కేరళ బాలిక మరణించింది. అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ “ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌(PAM)”తో పోరాడిన బాలిక చివరకు ఓడిపోయింది. సోమవారం రాత్రి కోజికోడ్‌లో ఫద్వా పీపీ అనే బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది.

మరణించిన బాలిక ఫద్వా మే 13 నుంచి ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో చికిత్స పొందుతోంది. వారం రోజుల పాటు వెంటిలేటర్ సపోర్టు‌తో చికిత్స అందించారు. ఈ ఇన్ఫెక్షన్‌కి ఉపయోగించే మిల్టెఫోసిన్ అనే ఔషధం వినియోగించే సమయానికే ఆమె పరిస్థితి క్షీణించింది. మూన్నియూర్ సరస్సులో స్నానం చేసిన తర్వాత ఈ అమీబా ఇన్ఫెక్షన్ బాలికకు సోకింది. ఆమెతో పాటు సరస్సులోకి దిగిన మరో నలుగురిని వైద్యులు పరీక్షించినప్పటికీ అదృష్టవశాత్తు వీరికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని లేదని తేలింది.

Read Also: Lavu Sri Krishna Devarayalu: అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడులో అరాచకం సృష్టించారు..

మే 1న బాధితురాలు తన బంధువులతో కలిసి ఇంటికి సమీపంలో ఉన్న సరస్సులో స్నానానికి దిగింది. మే 10న ఆమెకు జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో స్థానికంగా ఉన్న పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలికను మే 12న చెలారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేర్పించారు. లక్షణాలు ఎక్కువ కావడంతో కోజికోడ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అదే రోజు ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది.

ఈ అమీబా ఇన్ఫెక్షన్ ఏమిటి..?

దీనిని ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) లేదా అమీబిక్ మెనింజైటిస్ అని కూడా పిలుస్తారు, ఇది నేగ్లేరియా ఫౌలెరీ అమీబా వల్ల కలిగే అరుదైన, ప్రాణాంతక వ్యాధి. కలుషిత నీటిలో ఉండే ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఆ తర్వాత మెదడులో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మెదడును క్రమక్రమంగా తినడం ప్రారంభిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వాసన కోల్పోవడం, తలనొప్పి, మెడ దృఢత్వం, కాంతిని చూడలేకపోవడం, వికారం, వాంతులు, దిక్కుతోచని స్థితి, మగత మరియు మూర్ఛలు వంటి లక్షణాలు అమీబా సోకిన రెండు వారాల తర్వాత కనిపిస్తాయి.