NTV Telugu Site icon

BrahMos: సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

Brahmos Ng 1

Brahmos Ng 1

భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేందుకు ఇటీవల డీఆర్డీఓ, సైన్యం వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్, పినాక వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది. ‘బ్రహ్మోస్’ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఎస్యూ -30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ధ్వంసం చేసింది.

ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షపై భారత వైమానిక దళం హర్షం వ్యక్తం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్యూ -30 ఎంకేఐ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ లక్ష్యాన్ని తాకిందని… ఈ పరీక్షతో ఎస్యూ -30 ఎంకేఐ నుంచి భూమి, సముద్రంలోని సుదీర్ఘ లక్ష్యాలను ఖచ్చితంగా దాడులు చేయగల సామర్థ్యం సాధించిందని వెల్లడించింది.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మీడియం రేంజ్ మిసైల్… ఇండియా, రష్య దేశాలు సంయుక్తంగా దీన్ని డెవలప్ చేశాయి. ఇండియాలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్లతో ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇది బ్రహ్మోస్ వల్లే దక్కింది. ప్రపంచంలో ఉన్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లలో బ్రహ్మోస్ అత్యుత్తమైనదిగా పేరుంది. భూమిపై నుంచి, నౌకలు, సబ్ మెరైన్స్, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేలా బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దారు. మాక్ 3+ స్పీడ్ లో ప్రయాణించే ఈ క్షిపణి ముందు శత్రు దేశాలు భయపడక తప్పదు. దాదాపుగా 400 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా, అత్యంత వేగంగా… శత్రువుల రాడార్లు పసికట్టకుండా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని హిట్ చేసే సామర్థ్యం బ్రహ్మోస్ సొంతం.

 

 

Show comments