Site icon NTV Telugu

BJP vs BJP: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారిన అంశం

Bommai Vs Fadnavis

Bommai Vs Fadnavis

Border dispute between Karnataka and Maharashtra: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలు కర్ణాటకలో విలీనం చేస్తాం అని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చెబుతుంటే.. మరాఠీ మాట్లాడే కర్ణాటక ప్రాంతాలను దక్కించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ బీజేపీగా మారింది. ఒకే పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి తోడుగా మహారాష్ట్ర ఎన్సీపీ, శివసేనలు కూడా ఈ వివాదంలో భాగం అయ్యాయి.

తాజాగా శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతకుముందు మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ కూడా రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదంపై బస్వరాజ్ బొమ్మై వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌లు దృఢంగా వ్యవహరించాలని కోరారు. కేంద్ర ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని అజిత్ పవార్ కోరారు.

Read Also: UK’s Asian Rich List 2022: యూకే ఆసియా సంపన్నుల జాబితాలో రిషిసునాక్, భార్య అక్షతామూర్తి

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జాత్ తహసీలుకు చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అనడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా మహారాష్ట్రలోని ఏ గ్రామం కూడా కర్ణాటకలోకి వెళ్లదని.. బెల్గాం-కార్వార్-నిపానీ సహా మరాఠీ మాట్లాడే గ్రామాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఏ గ్రామం కూడా కర్ణాటకలో చేరేందుకు తీర్మానం చేయలేదని ఫడ్నవీస్ అన్నారు.

ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రాజకీయ సాధనంగా మారిందని.. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని లేవనెత్తుతోందని.. కర్నాటక సరిహద్దులను రక్షించే సామర్థ్యం మా ప్రభుత్వానికి ఉందని బొమ్మై వ్యాఖ్యానించారు. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది. 1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది.

Exit mobile version