Hoax Bomb Threats: వరసగా నకిలీ బాంబు బెదిరింపులు ఇండియా విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. భారత విమానయాన రంగాన్ని నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఈ నకలీ బెదిరింపుల వల్ల ఏయిర్‌లైన్ సంస్థలు కోట్లలో నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండర్, జర్మనీ నుంచి వచ్చాయని తెలుస్తోంది. కావాలనే భారత విమానాలను టార్గెట్ చేస్తు్న్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గత సోమవారం నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కి బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ముంబై నుంచి న్యూయార్క్ వె ళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది. దీంతో సదరు సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఈ బెదిరింపుల ఫలితంగా విమానయాన సంస్థలకు రూ. 80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 200 మందితో 130 టన్నుల ఇంధనంతో బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు రావడంతో రెండు గంటల్లోపే ఢిల్లీలో ల్యాండ్ అయింది. దీంతో సురక్షితంగా ల్యాండ్ కావడానికి 100 టన్నులు ఇంధనాన్ని డంప్ చేయాల్సివచ్చింది. ఇంధనం వృథా వల్ల రూ. 1 కోటి నష్టం వాటిల్లింది.
Read Also: Sarfaraz Khan: సర్ఫరాజ్ సెంచరీపై పలువురు క్రికెటర్లు ప్రశంసలు..
అంతకుముందు ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ మారుమూల విమానాశ్రయం అయిన ఇకాలూయిట్‌కి మళ్లించారు. 200 మందితో చికాగో చేరుకోవడానికి విమానానికి మూడున్నర రోజులు పట్టింది. ఈ మొత్తం పరిణామంలో రూ. 15-20 కోట్ల మించి నష్టం వాటిల్లింది.
కేవలం ఇంధన ఖర్చులే కాదు..షెడ్యూల్ చేయని ల్యాండింగ్ ఛార్జీలు, ప్రయాణికుల వసతి, విమానం గ్రౌండింగ్, సిబ్బందిని మార్చడంతో సహా మొత్తం ఖర్చు రూ. 3 కోట్లకు మించి ఉంటోంది. నిజానికి ఇక్కడ కావాలనే భారత విమానయాన సంస్థల్ని దెబ్బతీయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఈ బెదిరింపుల వల్ల ప్రయాణికుల్లో భయాందోళన పెంచడంతో పాటు అధికారుల్ని పనిఒత్తిడిలోకి నెట్టుతోంది. మరోవైపు ఇండియా నుంచి వెళ్లే, ఇండియాకి వచ్చే ఏ విదేశీ ఎయిర్ లైన్ సంస్థ కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు ఎదుర్కొలేదు. ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి దేశీయ ప్లేయర్స్‌కి మాత్రమే బెదిరింపులు రావడం గమనార్హం.
అంతర్జాతీయ విమానాలే కాకుండా దేశీయంగా తిరిగే విమానాలు కూడా ఈ బెదిరింపులు ఎదుర్కొన్నాయి. దేశీయ విమానాల రూట్ మార్చడం వల్ల కంపెనీలకు ప్రతీ గంటలకు రూ. 13 లక్షల నుంచి 17 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. అంతర్జాతీయ విమానాల్లో ఇది 5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇలా రూట్స్ మార్చడం వల్ల రూ. 12 కోట్ల నష్టం వాటిల్లింది. విమానాల తనిఖీ, సిబ్బంది-ప్రయాణికులకు వసతి, ఇంధనం, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఖర్చుల్ని జోడిస్తే నష్టం రూ. 80 కోట్లకు చేరుతోంది.