Site icon NTV Telugu

PM Modi: రక్తం, నీరు కలిసి ప్రవహించవు..

Pm Modi Live

Pm Modi Live

PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏమవుతుందో పాకిస్తాన్‌కి తెలియజేశామని చెప్పారు. అణు బ్లాక్‌మెయిల్‌లకు దిగితే ఇక భారత్ ఎంతమాత్రం సహించదని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యం భారత్ ప్రజల్ని, గుడులను, గురుద్వారాలను టార్గెట్ చేసిందని, మన సైన్యం స్థావరాలను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు భారతదేశంపై ప్రయోగించడాన్ని ప్రపంచం చూసిందని, భారత్ తన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని మనం నాశనం చేశామని చెప్పారు.

Read Also: PM Modi: భారత్ ‘‘న్యూక్లియర్’’ బ్లాక్‌మెయిల్‌ని సహించదు.. పాక్‌కి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..

అణ్వాయుధాలను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదానికి పాల్పడతామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని, దీని ద్వారా పాక్ ప్రభుత్వం వీరి వెనక ఉన్నదనిన స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఉగ్రవాదం ఏ రోజైనా పాకిస్తాన్‌ని నాశనం చేయడం ఖాయమని అన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుపెడితేనే పాకిస్తాన్‌కి మనుగడ ఉంటుందని చెప్పారు.

ఉగ్రవాదం ఆపేదాకా పాకిస్తాన్‌తో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు ఉంటే పీఓకే పైనే అని అన్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగమని, అలాగే నీరు, రక్తం కలిసి ప్రవహించలేదని చెప్పారు. దీని ద్వారా సింధూ జలాల ఒప్పందాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. గతంలో పుల్వామా దాడి సమయంలో కూడా ఇదే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది.

Exit mobile version