Site icon NTV Telugu

Arvind Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసింది..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తు్న్న సీరియల్ కిల్లర్ బీజేపీ అని వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఇలా మాట్లాడటం గమనార్హం. జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ద్వారా సేకరించిన డబ్బును ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం బీజేపీ వినియోగిస్తోందని కేజ్రీవాల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ఆరోపించారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి, రాష్ట్రాలలో వారి ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ కోట్లాది రూపాయలను ఖర్చు చేయడంతో ప్రజలు ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్వీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపించారు. పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం మొదలైన వాటిపై విధించిన జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.7,500 కోట్ల ఆదాయం వస్తుందని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. “ప్రభుత్వాలను పడగొట్టడానికి వారు ఇప్పటివరకు ₹ 6,300 కోట్లు ఖర్చు చేశారు. వారు ప్రభుత్వాలను పడగొట్టకపోతే గోధుమలు, బియ్యం, మజ్జిగ మొదలైన వాటిపై జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.” అని ఆయన పేర్కొన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు మేరకు ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసినప్పటి నుంచి ఆప్, బీజేపీల మధ్య రాజకీయంగా చిచ్చు రాజుకుంది. ఈ కేసుకు సంబంధించి రాజధానిలోని సిసోడియా నివాసంతో పాటు దేశంలోని 30 ఇతర ప్రాంతాల్లో ఆగస్టు 19న దర్యాప్తు సంస్థ దాడులు చేసింది.

JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌భేటీ.. విషయం ఇదేనా..?

అరవింద్ కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను, అతని పాలనా నమూనాను చూసి బీజేపీ భయపడి మనీష్ సిసోడియాను నకిలీ కేసులో ఇరికించి అతని ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రం సీబీఐని పంపిందని ఆప్ ఆరోపించింది. సీబీఐ దాడి జరిగిన ఒక రోజు అనంతరం తనపై ఉన్న అన్ని అవినీతి ఆరోపణలను ఎత్తివేసేందుకు బీజేపీ తనను సంప్రదించిందని, తాను బీజేపీలో చేరితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా నియమిస్తానని హామీ ఇచ్చినట్లు మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

ఈ వారం ప్రారంభంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని బీజేపీ నాయకులు తమను సంప్రదించారని ఆ ఎమ్మెల్యేలే వెల్లడించారు. లేకుంటే వారు కూడా నకిలీ కేసుల్లో సీబీఐ, ఈడీని ఉంటుందని బెదిరించారని ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలిపారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఢిల్లీ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిసోడియాపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ తప్పుడు వాదనలు చేసిందని బీజేపీ ఆరోపించింది.

Exit mobile version