NTV Telugu Site icon

Rahul Gandhi: రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయం చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే: బీజేపీ

Rohit Vemula

Rohit Vemula

Rahul Gandhi: రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు క్లోజర్ రిపోర్టును ఇచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న రోహిత్ వేముల మృతిపై తెలంగాణ పోలీసులు విచారణ ముగించారు. తుది నివేదికను దాఖలు చేశారు. తాను ఎస్సీ కులానికి చెందినవాడిని కాదని గుర్తించడంతో, అసలు కులం బయటపడుతుందనే భయంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ఇది నిజమైతే తన అకడమిక్ డిగ్రీలను కోల్పోతాననే, విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి ఉండొచ్చని నివేదిక పేర్కొంది.

Read Also: Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..

తాజాగా ఈ రిపోర్టు పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దళితులను రాజకీయ ప్రయోజనాల కోసం దోపిడి చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. రోహిత్ వేముల మరనాన్ని రాజకీయాల కోసం వాడుకున్న రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణ పోలీసులు రోహిత్ వేము దళితుడు కాదని, ఇది ఆత్మహత్యే అని రిపోర్టు ఇచ్చారని, రాహుల్ గాంధీ దళితులకు క్షమాపణ చెబుతారా..? అని కమలం పార్టీ ప్రశ్నించింది.

ఈ సమస్యను రాజకీయం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రోహిత్ వేముల మరణాన్ని రాహుల్ గాంధీ తన నీచ రాజకీయాల కోసం ఉపయోగించాడని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ మరియు సో కాల్డ్ ‘సెక్యులర్’ పార్టీలు దళితులను తమ రాజకీయాల కోసం తరచుగా ఉపయోగించుకున్నాయి కానీ వారికి న్యాయం చేయడంలో ఎప్పుడూ విఫలమవుతున్నాయి. ఇది అందుకు మరో ఉదాహరణ’’ అని ఆయన పోస్ట్ చేశారు.