Site icon NTV Telugu

Assembly election 2024: అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. సిక్కింలో ఎస్కేఎం..

Bjp

Bjp

Assembly Elections: హిమాలయ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. అరణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు సిక్కింలో “సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం)” అధికారాన్ని నిలబెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లకు గానూ 46 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. ఎన్‌పీపీ కేవలం 05 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు 8 చోట్ల గెలుపొందారు. ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వరసగా బీజేపీ అరుణాచల్‌లో హ్యాట్రిక్ కొట్టింది.

Read Also: Komatireddy: మేడిగడ్డ ప్రపంచంలో వింత అన్నాడు.. నిజమే 3 నెలలకు కూలింది వింతే..!

ఇక సిక్కింలో అధికార ఎస్కేఎం మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు గానూ 31 స్థానాలతో క్లీన్‌స్వీప్ చేసింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) కేవలం ఒక స్థానానికి పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖతా తెరవలేదు. ప్రస్తుతం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ మాట్లాడుతూ.. సిక్కిం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మనసుతో ప్రజల కోసం పనిచేశామని అందుకే గెలిచామని చెప్పారు. మరోవైపు దేశంలోనే అత్యధికా కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్డీఎఫ్ అధినేత పవన్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. తవాంగ్ జిల్లాలోని ముక్తో నుంచి పోటీ లేకుండా నాలుగు పర్యాయాల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కింలో 79 శాతం పోలింగ్ నమోదు కాగా, అరుణాచల్‌లో 82.7 శాతం నమోదైంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు సిక్కిం ఒక ఎంపీ, అరుణాచల్‌లోని రెండు ఎంపీ స్థానాలకు జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.

Exit mobile version