Site icon NTV Telugu

Varun Gandhi: ‘ఎగిరే శవపేటికలను ఎప్పుడు వదిలించుకుంటారు’.. వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Varun Gandhi

Varun Gandhi

Varun Gandhi: రాజస్థాన్‌లో బార్మర్ సమీపంలో శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మిగ్-21 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్-21 బలి తీసుకుంది. ఈ పాత కాలపు జెట్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని విరమించుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు భారత వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నిన్న బార్మర్‌లో జరిగిన ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. కొన్నేళ్లుగా మిగ్-21 తరచుగా ప్రమాదాలకు గురవుతోంది. ఈ విమానం ఇప్పటివరకు దాదాపు 200 మంది పైలట్లను బలిగొంది. ఈ ‘ఎగిరే శవపేటిక’ను వైమానిక దళం విమానాల నుండి ఎప్పుడు తొలగిస్తారు? దేశంలోని పార్లమెంటు ఆలోచించాలి, మన పిల్లలను ఈ విమానాన్ని నడిపేందుకు అనుమతిస్తామా?” అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

Pending Cases in Courts: దేశంలో దాదాపు 5కోట్ల కేసులు పెండింగ్.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ భల్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. భారత వైమానిక దళం ఈ సెప్టెంబర్ చివరి నాటికి మిగ్‌-21 విమానాల సేవలను నిలిపివేయాలనుకుటోంది. దాంతో మిగ్‌ 21 బైసన్ స్క్వాడ్రన్‌లో మూడు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవి కూడా ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున రిటైర్ అవుతూ 2025 నాటికి పూర్తిగా వైమానిక దళాన్ని వీడనున్నాయని తెలుస్తోంది. వింగ్ కమాండర్ రాణా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారని, ఫ్లైట్ లెఫ్టినెంట్ భల్ జమ్ము కశ్మీర్‌కు చెందిన వారని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.

Exit mobile version