BJP: కర్ణాటక బిజెపి ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కలబురిగిలో జరిగిన ఒక సభలో రవి కుమార్ మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత చలవాడి నారాయణ స్వామి పట్ల వ్యవహరించిన తీరుపై ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ మద్దతుదారులు ప్రభుత్వ అతిథి గృహాన్ని ముట్టడించిన సమయంలో ఆయన లోపల ఉన్నారు.
అయితే, ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. కలబురిగి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ జాతీయతను గురించి ప్రశ్నించడం వివాదంగా మారింది. ‘‘కలబురగి డిసి పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా ఇక్కడ ఐఎఎస్ అధికారియో నాకు తెలియదు. మీ చప్పట్లు చూస్తుంటే, డిసి నిజంగా పాకిస్తాన్ నుండి వచ్చినట్లు అనిపిస్తుంది” అని అన్నారు. అయితే, రవికుమార్ వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో, ఈ వ్యాఖ్యల గురించి తనకు తెలియదని నారాయణ స్వామి అన్నారు.
Read Also: Jaishankar: ‘‘పాకిస్తాన్ దాడుల గురించి యూఎస్ హెచ్చరిక’’.. అందుకే భీకర దాడులు చేశాం..
మే 21న, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గేని కుక్కతో పోల్చారని ఆరోపిస్తూ, నారాయణ స్వామి బస చేసిన కలబురిగిలోని చిత్తాపూర్ గెస్ట్ హౌజ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ రవికుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి నాయకులను, వారు చేసే ప్రసంగాలను చూస్తే, అది తీవ్ర కలతపెట్టే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గౌరవనీయమైన అధికారిపై ఇటువంటి ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు. ‘‘తమ తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడే వారిని మనం నిజమైన భారతీయులు అని కూడా పిలవగలమా? అతనే సంఘ విద్రోహి’’ అని విమర్శించారు.
పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల దేశవ్యాప్త ఆగ్రహానికి కారణమయ్యాయి. దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు మంత్రిని తీవ్రంగా మందలించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అదే కమ్యూనిటీకి చెందిన సోదరిని ప్రధాని మోడీ పంపారని విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
