బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నూతనోత్సాహం బీహార్‌లోనూ కొనసాగేలా కేడర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ ఆ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఢిల్లీలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ చాకచక్యంగా తమ వైపు మలుచుకోగలిగింది. సులువుగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే మాదిరిగా నితీష్ కుమార్ సర్కార్‌పై ఏర్పడిన వ్యతిరేకతను తెలివిగా తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కాషాయ పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎలాగైనా 225 సీట్లు సాధించి తీరాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. నితీష్ కుమార్‌తో కలిసి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే ఆర్జేడీ.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఆ అవకాశం తేజస్వీ యాదవ్‌కు ఇవ్వకూడదని బీజేపీ ఆలోచన చేస్తోంది. ఎలాగైనా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. సీట్ల పంపకాల విషయంలో తేడా రాకుండా నితీష్ కుమార్‌తో చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే జేడీయూ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలని చూస్తోంది. దీనికి బీజేపీ ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.
ఇక 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తే కేవలం 43 సీట్లు మాత్రమే సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన 110 సీట్లలో 74 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా తక్కువ సీట్లు సాధించినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి కావడం విశేషం. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి వెళ్లినా.. కొద్ది రోజులకే తిరిగి బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీయా కూటమి ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధించింది.