NTV Telugu Site icon

Wayanad: వయనాడ్‌లో ప్రియాంక వర్సెస్ నవ్య హరిదాస్.. పేరు ప్రకటించిన బీజేపీ

Wayanadbjp

Wayanadbjp

వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీతో తలపడేది ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కమలనాథులు కూడా సమఉజ్జినే రంగంలోకి దింపారు. వాయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ను కమలం పార్టీ రంగంలోకి దింపింది. శనివారం సాయంత్రం ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.

నవ్య హరిదాస్.. బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. నవ్య.. హెచ్‌ఎస్‌బీసీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పని చేశారు. అయితే ప్రజా సేవ చేసేందుకు ఆమె ఉద్యోగాన్ని వదులుకుని బీజేపీ పార్టీలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో వరుసగా రెండో సారి బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. కార్పొరేషన్‌లో బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఒక కౌన్సిలర్‌ను ప్రియాంకపై బీజేపీ పోటీకి దింపింది.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల భారీ విజయంతో గెలుపొందారు. దీంతో రాయ్‌బరేలీలో కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ బైపోల్ ఎన్నిక వచ్చింది. వయనాడ్‌లో ప్రియాంక పోటీ చేస్తారని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. అన్నట్టుగానే ఆమె పేరును ప్రకటించింది. ఇక అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్‌సభ ఉప ఎన్నిక జరగనుంది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు. పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్లి ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాయనాడ్ కలెక్టరేట్‌కు రోడ్‌షో ద్వారా వెళ్లి ప్రియాంక నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక వయనాడ్ ఎన్నికల ఫలితం నవంబర్ 23న విడుదల కానుంది.

 

Show comments