Site icon NTV Telugu

BJP Celebrations: “రారండోయ్‌ వేడుక చేద్దాం” అంటున్న బీజేపీ. సెలబ్రేషన్స్‌కి రేపే శ్రీకారం..

Bjp Celebrations

Bjp Celebrations

BJP Celebrations: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపటి నుంచి దేశవ్యాప్తంగా పండగ చేసుకోనుంది. ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను మరింత ఉత్సాహంగా నిర్వహించనుంది. సెలబ్రేషన్స్‌ని ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 25 (సోమవారం) దాక కొనసాగించనుంది. ఎందుకు?, ఏమిటీ? అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్ము దేశ ప్రథమ మహిళ(రాష్ట్రపతి)గా గెలవనున్న నేపథ్యంలో బీజేపీ ఈ వేడుకలకు రంగం సిద్ధం చేసింది.

అత్యున్నత రాజ్యాంగ పదవికి తొలిసారిగా ఒక గిరిజన మహిళను ఎంపిక చేయటం తమ పార్టీకే సాధ్యమైందంటూ బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకోబోతోంది. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఎలక్షన్‌ రిజల్ట్‌ గురువారం రానుండటంతో ఆ రోజే ఈ క్యాన్వాస్‌కి శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా దేశంలోని ముఖ్య కూడళ్లలో ప్రత్యేక పోస్టర్లను అంటించనుంది. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి పదవికి నామినేట్‌ చేసినందుకు ప్రధాని మోడీకి ఘనంగా కృతజ్ఞతలు తెలపనుంది. ఈ మేరకు బీజేపీ జాయింట్‌ జనరల్‌ సెక్రెటరీ శివప్రకాష్‌ చత్తీస్‌గఢ్‌లోని పార్టీ నాయకులతో ఆదివారం ప్రత్యేకంగా మీటింగ్‌ పెట్టారు.

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నందున ఆ రోజుతో సెలబ్రేషన్స్‌ని ముగించనున్నారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌రావు సైతం పార్టీ లీడర్లకు ఈ వేడుకల గురించి వివరించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ‘ఇన్నాళ్లూ సరైన గుర్తింపుకు, ప్రోత్సాహకానికి నోచుకోని వర్గాలకు సరైన అవకాశాలు ఇవ్వాలని, తద్వారా దేశాభివృద్ధిలో వాళ్లకూ భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకున్నాం. ఇలాంటి విధాన నిర్ణయాలను ఎన్నింటినో బీజేపీ ఇప్పటికే అమలుచేస్తోంది.

read more: Uttar Pradesh: సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఎదురుదెబ్బ.. క్యాబినెట్ మంత్రి రాజీనామా

ద్రౌపదీ ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేయటం వల్ల గిరిజనుల్లో బీజేపీ పట్ల ఆదరణ తప్పకుండా పెరుగుతుంది’ అని మురళీధర్‌రావు అన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్‌ ఓరాన్‌ మాట్లాడుతూ ఇది గిరిజనులకే కాదు ప్రతిఒక్కరికీ సంతోషంగా సెలెబ్రేట్‌ చేసుకోవాల్సిన సందర్భమని పేర్కొన్నారు. ఎస్టీలే కాకుండా అన్ని వర్గాలవాళ్లూ ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. రాజ్యాంగ విలువలకు పట్టం కడుతున్న విశేష ఉత్సవంగా జరుపుకోవాలని సూచించారు.

కులాలతో, మతాలతో సంబంధంలేకుండా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ద్రౌపదీ ముర్ముకే ఓటేయడానికి ఉత్సాహం చూపించటం శుభపరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా బైక్‌ ర్యాలీ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కమలదళం ప్రభావం తక్కువనే లోపాన్ని అధిగమించేందుకు దీనికి రూపకల్పన చేసింది. ‘పల్లె గోస-బీజేపీ భరోసా’లో భాగంగా పార్టీ నేతలు గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించి, ఆ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

Exit mobile version