యూపీ స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది బీజేపీ. అయితే తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 75 జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఏకంగా 65 జిల్లా పరిషత్‌లను దక్కించుకున్నారు. ఎస్పీ పార్టీకి ఆరు దక్కాయి. ఇతరులు ఓ స్థానంలో గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టామని చెప్పిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 53 జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం కౌంటింగ్ జరిగింది. వీటిలో మెజార్టీ స్థానాలు కాషాయ దళం దక్కించుకుంది. అంతకు ముందు 22 జెడ్పీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 21 బీజేపీయే దక్కించుకుంది. ఒకటి మాత్రమే ఎస్పీ గెలుచుకుంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి.. ఈ విజయం భారీ ఊరటనిస్తోంది. ఇదే స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపుపై… ప్రధాని మోదీ- పార్టీ నేతలకు, సీఎం యోగి ఆధిత్యనాథ్‌కి అభినందనలు తెలిపారు. అటు హోంమంత్రి అమిత్ షా కూడా కార్యకర్తలు, సీఎంను అభినందించారు. అటు యూపీ సీఎం యోగి మాత్రం.. మోడీ ప్రభుత్వ సంక్షేమ నిర్ణయాల వల్లే గెలిచినట్లు చెప్పారు. క్రెడిట్ మొత్తం ప్రధానికి కట్టబెట్టారు. అఖిలేష్ యాదవ్ మాత్రం ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. యోగి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అధికారుల సాయంతో గెలిచారని ఆరోపించారు. చాలా చోట్ల ఎస్పీ నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఎస్పీ నేతలను చెదరగొట్టారు. అటు భారత్ కిసాన్ నాయకులు బరిలోకి దిగినప్పటికీ.. బీజేపీ అభ్యర్థుల విజయానికి అడ్డుకోలేకపోయారు. మొత్తంగా యూపీ పొలిటికల్ సమీకరణాలను ఈ ఎన్నికల ఫలితాలు మార్చేశాయ్. ఇదే సీన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కనీసం 300 స్థానాలు గెలుస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.