Site icon NTV Telugu

Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!

Keralabjp

Keralabjp

కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్‌ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్‌గా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు వీవీ.రాజేష్‌ను మేయర్‌గా ఎంచుకున్నారు. దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్ట్ వచ్చినట్లైంది.

వీవీ.రాజేష్‌కు 50 మంది బీజేపీ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు తెలిపారు. దీంతో రాజేష్ మేయర్‌గా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. ఇక యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్‌కు 17 ఓట్లు, ఎల్‌డీఎఫ్ మేయర్ అభ్యర్థి ఆర్‌పీ శివాజీకి 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది.

వీవీ.రాజేష్ బ్యాగ్రౌండ్ ఇదే..
వీవీ.రాజేష్ (50) ప్రస్తుతం తిరువనంతపురం కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా రెండోసారి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుంచి 515 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా న్యాయవాది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా.. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 39,596 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సీపీఐ(ఎం) అభ్యర్థి వీకే ప్రశాంత్‌పై ఓడిపోయారు. 1996 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజా జీవితంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యమే మేయర్‌గా ఎన్నిక కావడానికి దారి తీశాయి.

 

Exit mobile version