NTV Telugu Site icon

Bilkis Bano Case: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Bilkisbanocase

Bilkisbanocase

బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దోషుల విడుదలకు సంబంధించిన తమ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లైంది.

2002 గుజరాత్‌ గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపినందుకు దోషులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. ఆ ఘటనపై గత జనవరిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషుల శిక్షాకాలం ముగియకముందే ‘సత్ప్రవర్తన’ కారణంగా విడుదల చేయడంపై మండిపడింది. దోషులందరూ వెంటనే జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ విచారణ సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని తెలిపింది. గుజరాత్‌ సర్కార్‌ దోషులతో కుమ్మకైందని.. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధర్మాసనం మండిపడింది.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని గుజరాత్‌ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీం వ్యాఖ్యలు సరికాదని, కేసు రికార్డుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై పక్షపాతంతో వ్యవహరించారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయన్‌లతో కూడిన ధర్మాసనం.. గురువారం పిటిషన్‌ను కొట్టివేసింది.

2002లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.