Site icon NTV Telugu

Bihar Politics: బీజేపీతో సీఎం నితీష్ కుమార్ తెగదెంపులేనా.. నేడు జేడీయూ కీలక సమావేశం

Bihar Politics

Bihar Politics

Bihar Politics: బీహార్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతుందా.. అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీని బీజేపీ చీల్చేందుకు ప్రయత్నిస్తుందంటూ జేడీయూ అభద్రతా భావానికి గురవుతోంది. దీంతో బీహార్ లో సంయుక్తంగా అధికారంలో ఉన్న బీజేపీ-జేడీయూ పార్టీ బంధానికి బీటలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లుగానే ఉన్నాయి.

ఇటీవల జేడీయూ కీలక నేత ఆర్సీపీ సింగ్ పార్టీ రాజీనామా చేసి నితీష్ కుమార్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గతంలో జేడీయూ ఎంపీగా ఉన్న ఆర్సీపీ సింగ్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది బీజేపీ. ఆ సమయంలో తనను సంప్రదించకుండా మంత్రి పదవి ఇవ్వడంపై సీఎం నితీష్ కుమార్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇటీవల ఆర్సీపీ సింగ్ రాజ్య సభ కాలపరిమితి తీరిపోయింది. అయితే మరోసారి జేడీయూ ఆయనకు రాజ్యసభ అవకాశం నిరాకరించింది. దీంతో ఆయన నితీష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ ఏడు జన్మల్లో కూడా ప్రధాని కాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Hanuman Chalisa Chanting Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే..

ఇదిలా ఉంటే మంగళవారం నితీష్ కుమార్ తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే.. తాము జేడీయూతో కలిసి అధికారం ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. గతంలో కూడా ఆర్జేడీతో జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆర్జేడీ నుంచి విడిపోయి జేడీయూ మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. ప్రస్తుతం మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి జేడీయూ ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఈ పరిణామాలపై బీజేపీ మౌనంగా ఉంది. మంగళవారం సమావేశాల్లో సీఎం నితీష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూద్దాం అనే ఆలోచనలో ఉంది. మరోవైపు ఎన్డీయే కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని జేడీయూ చెబుతున్నప్పటికీ.. లోపల మాత్రం అసంతృప్తి నివురుకప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో బీజేపీకి 77 మంది, జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 75, కాంగ్రెస్, వామపక్షాలకు కలిపి మొత్తం 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీని కాదంటే ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Exit mobile version