NTV Telugu Site icon

Liquor Bottles: ప్రమాదానికి గురైన కారు.. మద్యం బాటిళ్లతో జనాలు జంప్! వీడియో వైరల్

Bihar Liquor Bottles

Bihar Liquor Bottles

People Jumps with Liquor Bottles after Car Meets Accident In Gaya: అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా.. అందులో ఉన్న బాటిళ్లను జనాలు ఎత్తుకెళ్లారు. కారు నిండా ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను తీసుకుని జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్‌గా మారిన వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కార్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వివరాల ప్రకారం… విదేశీ మద్యం బాటిళ్లతో ఓ కారు సోమవారం (అక్టోబర్ 30) గయా నుంచి ధోబి-ఛత్ర జాతీయ రహదారిపై వెళుతోంది. చత్రా మలుపు వద్ద కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న ఆ కారు.. ముందున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో రోడ్డు పైన వెళ్లే వారు సాయం చేసేందుకు వచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారు పారిపోయారు. కారు లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో.. సాయం చేసేందుకు వచ్చిన వారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. ఇది చూసిన ఇంకొందరు కూడా మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు.

Also Read: Health Tips : చలికాలంలో ఈ జ్యూస్ ను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కారు వద్ద భారీగా జనాలు గుమిగూడడంతో ధోబి-ఛత్ర రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న మద్యం బాటిల్స్ ఖాళీ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక 2016 నుంచి బిహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. రాష్ట్రంలో మద్యం విక్రయించడం లేదా వినియోగం రెండూ శిక్షార్హమైన నేరం.