Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. మరోసారి బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈసారి కూడా బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీయే కూటమి ఎన్నికల బరిలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనే ఊహాగానాలను పక్కనపెట్టి, రాబోయే ఎన్నికల్లో నితీష్ నాయకత్వం వహిస్తారని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఎన్నికల తర్వాత సీఎం తానే కావాలా..? లేక వేరెవరినైనా నియమించాలనే విషయంపై నితీష్ కుమార్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Read Also: Trump-Zelenskyy meet: రసాభాసగా ట్రంప్-జెలెన్స్కీ మీటింగ్.. తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి..
ప్రస్తుతం ప్రజల మూడ్‌ని తెలుసుకునేందుకు బీజేపీ బీహార్‌లో సర్వే చేస్తోంది. సర్వే ఫలితాల ఆధారంగా ఎన్డీయే మిత్ర పక్షాల మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని పోటీకి దింపే అవకాశం ఉంది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను, బీహార్‌లో రిపీల్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ప్రతీ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తోంది.
బీహార్‌లో ఎన్డీయే కూటమి భాగస్వాములుగా బీజేపీ, జేడీయూ, రాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితన్ రామ్ మాంఝీ హిందూస్థానీ అవామీ మోర్చా (HAM), ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP) ఉన్నాయి. బీజేపీ దాదాపుగా 100 సీట్లలో పోటీ చేస్తుందని, జేడీయూ 90-95 సీట్లలో పోటీ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన స్థానాల్లో మిగతా ఎన్డీయే భాగస్వాములకు సీట్లను కేటాయించనున్నారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.