Bihar Deputy CM Tejashwi Yadav Requests for RJD Ministers: బీహార్ లో జేడీయూతో కలిసి రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ) మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసి బీహార్ లో అధికారం చేపట్టింది. నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇన్నాళ్లు జేడీయూతో పొత్తులో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఆర్జేడీపై ఉన్న జంగిల్ రాజ్ ముద్రను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మార్చాలని అనుకుంటున్నారు. తాజాగా తన ఆర్జేడీ మంత్రులకు 6 ముఖ్య సూచనలు చేశారు. రాష్ట్రమంత్రి వర్గంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నేతలకు కొన్ని మార్గదర్శకాలు తెలియజేశారు. ఆర్జేడీ మంత్రులెవరూ కూడా కొత్త వాహనం కొనుగోలు చేయవద్దని.. తమ కంటే పెద్దవారు తమ పాదాలను తాకవద్దని తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకోవాలని.. పేద ప్రజలను వారి కులం,మతంతో సంబంధం లేకుండా సహాయం చేయాలని మంత్రులకు సూచించారు. ఫేస్ బుక్ పోస్టు ద్వారా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన మంత్రులకు వీటిని సూచించారు.
Read Also: Tragedy: ఆ వీసా జీవితకాలం లేటు.. ఆత్మహత్య తర్వాత రోజే వచ్చిన వీసా
దీంతో పాటు ఆర్జేడీ మంత్రులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు , మద్దతుదారులు లేదా తమ కంటే పెద్దవారు మంత్రుల పాదాలు తాకడాన్ని అనుమతించరని ఆయన అన్నారు. మర్యాదగా నడుచుకుంటూ ప్రతీ ఒక్కరికి నమస్కారం, అదాబ్ అంటూ పలకరించారని సూచించారు. మంత్రులు ఫ్లవర్ బుకేల బదులు పెన్నులు, పుస్తకాలను తీసుకోవాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి నితీస్ కుమార్ నాయకత్వంలో అన్ని శాఖల మంత్రులు నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆర్జేడీ మంత్రులకు సూచించారు. చివరగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వారి శాఖలు చేసే అన్ని అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఆయన ఆర్జేడీ మంత్రులకు సూచించారు.
లాలూ హయాంతో బీహార్ లో జంగిల్ రాజ్ పరిపాలన ఉన్న విధంగానే.. ప్రస్తుతం జేడీయూ-ఆర్జేడీ పాలనతో మళ్లీ పాత జంగిల్ రాజ్ రోజులు వస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. దీనికి ప్రతిగా జంగిల్ రాజ్ ముద్రను తొలగించుకోవాలని ఆర్జేడీ భావిస్తోంది. మరో రెండున్నరేళ్లలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జంగిల్ రాజ్ ముద్రను చెరపేసుకోవాలని ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ భావిస్తున్నారు.
