CM Nitish Kumar: సాధారణంగా సీఎంల కాన్వాయ్ కోసం గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తూ ఉంటాం. అయితే, బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం ఏకంగా గంట పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కోసం శనివారం సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో వైశాలి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Read Also: ICC T20 World Cup 2026 Schedule: స్కాట్లాండ్ ఎంట్రీతో మారిన టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్..
భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కర్పూరి గ్రామానికి వచ్చారు. కర్పూరి గ్రామ్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఆయన కాన్వాయ్ ఆగకుండా ఉండేందుకు, ఆయన ప్రయాణ సమయంలో రైల్వే గేటును ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరిచే ఉంచాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. దీని వల్ల సమస్తిపూర్–ముజఫర్‌పూర్ రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
లలిత్‌గ్రామ్–న్యూఢిల్లీ వైశాలి ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.21 నుండి 11.19 గంటల వరకు సమస్తిపూర్ స్టేషన్‌లో నిలిచిపోయింది. షహీద్ ఎక్స్‌ప్రెస్ సుమారు 25 నిమిషాలు ఆలస్యం కాగా, టాటా–ఛప్రా ఎక్స్‌ప్రెస్ ఒక గంట ఏడు నిమిషాల పాటు నిలిచిపోయింది. బరౌని–గోండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యమైంది. ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల మరికొన్ని రైళ్లు కూడా ప్రభావితమయ్యాయి. రైల్వే గేట్ దాదాపు 37 నిమిషాలు పాటు తెరిచి ఉంచడంతో దాదాపుగా గంట పాటు రైలు సేవలు నిలిచిపోయి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
