BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!

  • వివాదంగా మారిన కాంగ్రెస్ ‘‘భారత్ సమ్మిట్’’ కార్యక్రమం..
  • ఇటలీకి చెందిన నేత భారత అంతర్గత విషయాల్లో జోక్యంపై బీజేపీ ఫైర్..
  • విదేశీ నేత వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ నవ్వడంపై విమర్శలు..
Rahul Gandhi

Rahul Gandhi

BJP: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘‘భారత్ సమ్మిట్’’ వివాదానికి కేంద్రంగా మారింది. ఇటలీకి చెందిన రాజకీయ నేత జియాకోమో ఫిలిబెక్ కాంగ్రెస్ పార్టీ నినాదం ‘‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’’ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఈ సమయంలో వేదికపై ఉన్న రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు నవ్వుతూ కనిపించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. భారత అంతర్గత విషయాల్లో విదేశీ రాజకీయ ప్రతినిధులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది.

పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్ అయిన జియాకోమో ఫిలిబెక్.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ రాహుల్ గాంధీ చాలాకాలంగా చేస్తున్న ఆరోపణల్ని పునరావృతం చేశారు. కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండే రాజకీయ పార్టీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ భావజాల ప్రతినిధులతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించింది.

రాహుల్ గాంధీ నవ్వులపై కిరణ్ రిజిజు ఫైర్..

ఇటలీ నేత వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక విదేశీయుడు భారతదేశాన్ని అవమానిస్తున్నప్పుడు ఎవరైనా నవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? భారతదేశాన్ని అవమానించేందుకు విదేశాలకు వెళ్లే భారతీయుల గురించి నేను మాట్లాడటం లేదు’’ అంటూ పోస్ట్ చేశారు.

మరోవైపు, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమంపై విమర్శలు చేశారు. దేశంలో, విదేశాల్లో వామపక్ష భావజాల ప్రచారకులను కాంగ్రెస్ ఆహ్వానించిందని, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.