NTV Telugu Site icon

Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్‌కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!

Ed

Ed

Betting App: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న బెట్టింగ్ యాప్ రాకెట్‌లో పాకిస్తాన్ కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ జాతీయుడిదే ఈ బెట్టింగ్ యాప్ అనేది విచారణలో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌లో పాకిస్తానీ కోణాన్ని ఈడీ కనిపెట్టడం ఇదే తొలిసారి. భారత్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కి ఈ డబ్బు పంపినట్లు తెలుస్తోంది. బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ల నుంచి నటులు,సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారు.

Read Also: Iron Rich Fruits: ఈ పండ్లలో ఐరన్ స‌మృద్ధిగా లభిస్తుంది.. తప్పక తినండి!

ఇప్పటికే నటీనటులు మల్లికా షెరావత్, పూజా బెనర్జీలను ఈడీ ప్రశ్నించింది. ఈ వారాంతంలో మరో ఇద్దరు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు పంపింది. రానున్న వారంలో మరో ఏడుగురు సెలబ్రిటీలకు కూడా సమన్లు అందుతాయని తెలుస్తోంది. మ్యాజిక్‌విన్ అనేది గేమింగ్ వెబ్‌సైట్, ఇది దుబాయ్‌లో ఉంటున్న భారతీయ పౌరులచేత ఆపరేట్ చేయబడుతోంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న బెట్టింగ్ గేమ్స్ ఫిలిప్పీన్స్ వంటి బెట్టింగ్ చట్టబద్ధమైన ఇతర దేశాల నుంచి నడుస్తున్నాయని ఈడీ వర్గాలు చెప్పాయి.

గేమ్స్ API ఇతర సోర్సెస్ నుంచి కాపీ చేయబడి మ్యాజిక్‌విన్‌లో తిరిగి ప్రసారం అవుతున్నాయని తేలింది. ఈ బెట్టింగ్ యాప్ చాలా సోషల్ మీడియా అకౌంట్స్‌ని కలిగి ఉంది. వీటిని భారతదేశంలో ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటోంది. ఈ కేసులో గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 67 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, పూణేలలో మ్యాజిక్‌విన్‌ కేసుతో సంబంధం ఉన్న 21 మంది వ్యక్తులపై గత వారం ఈడీ దాడులు నిర్వహించి సుమారు రూ.3.55 కోట్లను స్వాధీనం చేసుకుంది. యాప్‌పై అహ్మదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ చర్యలు తీసుకుంది. పేమెంట్ గేట్‌వేలు, షెల్ కంపెనీల అగ్రిగేటర్ల ద్వారా బెట్టింగ్ విజేతల డబ్బను వారి ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇదే కాకుండా దేశీయ నగదు బదిలీ(డీఎంటీ) ద్వారా కూడా ప్లేయర్లకు డబ్బు పంపబడుతోంది.