Site icon NTV Telugu

Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..

Northeast Woman

Northeast Woman

Bengaluru: ‘‘అథితి దేవోభవ’’ అని చెబుతుంటారు పెద్దలు. కానీ కర్ణాటకలో మాత్రం కొందరు విపరీతమైన భాషా దురాభిమానంతో వ్యవహరిస్తున్నారు. కన్నడేతరుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి బెంగళూర్ లేదా ఇతర కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే వారిని బలవంతంగా ‘‘కన్నడ’’ మాట్లాడాలని వేధిస్తున్నారు. ఈ జాడ్యం ఇతర రాష్ట్రాల వారిపై దాడి చేసేదాకా వెళ్లింది. ఇక ఉబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులకు అర్థంకాని కన్నడలో తిట్టడమో లేక వారిని బలవంతంగా కన్నడ మాట్లాడాలని వేధించడమే చేస్తున్నారు.

Read Also: Netanyahu: ప్రధాని మోడీతో మాట్లాడటానికి కీలక సమావేశాన్ని నిలిపేసిన నెతన్యాహూ..

తాజాగా, బెంగళూర్‌లో తాను వివక్షకు గురైనట్లు ఓ ఈశాన్య రాష్ట్రాల మహిళ చెప్పింది. తాను ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఉబర్ ఆటో డ్రైవర్ తనను వేధించాడని మహిళ ఆరోపించింది. తనకు కలిగిన అసౌకర్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోలో ఆటో డ్రైవర్ మహిళకు అర్థం కాని కన్నడ భాషలో మాట్లాడమని చెబుతున్నట్లు, ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బెంగళూర్ పోలీసులు మహిళ నుంచి వివరాలను కోరారు. ఉబర్ ఈ సంఘటనకు క్షమాపణలు చెప్పింది. అక్టోబర్ 02న రైడ్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగినట్లు బాధిత మహిళ ఎన్‌బీ చెప్పారు. ఆటో రాకపోవడంతో, ఆమె రైడ్ క్యాన్సిల్ చేసుకుని, వేరే ఆటోని బుక్ చేసుకుంది. అయితే, కొద్ది సేపటికి అక్కడి వచ్చిన ఆటోడ్రైవర్ పవన్ హెచ్ఎస్ అనే వ్యక్తి తన దారికి అడ్డుగా వచ్చి, డబ్బులు ఇవ్వాలని వేధించాడని, తనను దుర్భాషలాడాడని మహిళ చెప్పింది. ఈ ఉదంతాన్ని ఆమె వీడియో తీసింది. ఆమెకు భాష తెలియదని చెబుతున్నా, డ్రైవర్ తనను కన్నడలో తిడుతూనే ఉన్నాడని చెప్పింది. తన ఆటోతో ఢీకొట్టడానికి ప్రయత్నించినట్లు చెప్పింది. ‘‘మన దేశంలో కూడా మనం సురక్షితంగా లేము’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Exit mobile version