కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న నాలుగు నెలలకే ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు రాసిన సూసైడ్ నోట్‌లో తన భర్తతో పాటు ఆడపడుచు కారణమని ఆరోపించింది. నిరంతరం వేధింపులకు గురిచేయడంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది.
ప్రేమ వివాహం
మృతురాలు శ్వేత (25) బెంగళూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నాలుగు నెలల క్రితం ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఆదివారం ఆమె ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనాస్థలిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో శ్వేత తన భర్త, అతని పెద్ద అక్క తన మరణానికి కారణమని ఆరోపించింది. తాను ఏ తప్పు చేశానో కూడా తెలియకుండానే నిరంతరం మానసిక వేధింపులకు గురిచేశారని పేర్కొంది.
తన తల్లిని ఉద్దేశించి రాసిన లేఖలో.. ‘‘అమ్మా… నేను చనిపోతే వారిని శిక్ష లేకుండా వదిలేయొద్దు. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. బతకాలనే ఆసక్తి పోయింది. దయచేసి నన్ను క్షమించండి. నా నిర్ణయానికి నన్ను తప్పుపట్టొద్దు.’’ అని ఆమె రాసింది.
పోలీసుల దర్యాప్తు
శ్వేత మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులో చేసిన ఆరోపణల ఆధారంగా భర్త, అతని కుటుంబ సభ్యులను విచారించనున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

