Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు

Bengaluru Metro

Bengaluru Metro

Bengaluru Metro Viral Video: బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో తనను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడని ఓ మహిళ ఆరోపించడం కలకలం రేపింది. సదరు వ్యక్తిని మెట్రో రైలులోనే నిలదీసిన ఆమె.. అతడి ఫోన్‌ను అన్‌లాక్ చేసి చూపించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బెంగళూరు నగర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో సౌపిక (Sowpika) అనే పేరుతో ఉన్న మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెట్రోలో తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు తనకు తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించానని ఆమె ఆరోపించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె తీవ్ర ఆందోళనకు గురైనట్లు కనిపించింది. “నేను ప్రస్తుతం వణికిపోతున్నాను. మెట్రోలో నన్ను రికార్డ్ చేస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాను” అని ఆమె పేర్కొంది. తాను ఆ సమయంలో పూర్తిగా దుస్తులు ధరించి ఉన్నానని, తన దుస్తులకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. “నా శరీరంలో ఎక్కడా కనిపించేలా దుస్తులు లేవు” అని వీడియోలో వ్యాఖ్యానించింది.

వీడియోలో మహిళ పలుమార్లు “నన్ను ఎందుకు వీడియో తీశావు?” అని ఆ వ్యక్తిని ప్రశ్నించడం కనిపించింది. అతడి ఫోన్‌ను అన్‌లాక్ చేసి చూపించాలని కూడా డిమాండ్ చేసింది. ఈ క్రమంలో మెట్రో భద్రతా సిబ్బంది కూడా అక్కడ కనిపించారు. రైలు ఆగిన తర్వాత ఆ వ్యక్తి తన ఫోన్‌ను తిరిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడని మహిళ ఆరోపించింది. “నేను అతడి ఫోన్‌ను తీసుకుని భద్రతా సిబ్బందికి ఇచ్చాను. అయితే అతడు ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు” అని ఆమె వీడియోలో తెలిపింది. ఈ విషయంపై మెట్రో స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు, అక్కడి సిబ్బంది ఏడు రోజుల్లో స్పందిస్తామని చెప్పినట్లు పేర్కొంది.

వీడియోలో మెట్రో లిఫ్ట్ వద్ద కూడా మహిళ, ఆ వ్యక్తి మధ్య సంభాషణ కొనసాగినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళ చెప్పగా, ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు నగర పోలీసులు మహిళను ఘటనకు సంబంధించిన వివరాలు అందించాలని కోరారు. అనంతరం ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.