NTV Telugu Site icon

Bengaluru: ఐఐఎం-బీలో కుల వివక్ష.. డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు

Iimb

Iimb

బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థ ఐఐఎం-బీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లో కుల వివక్ష తీవ్ర కలకలం రేపింది. దీంతో ఐఐఎంబీ డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదైనట్లు శనివారం బెంగళూరు పోలీసులు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం మరియు న్యాయ సంహిత నిబంధనలను ఐఐఎంబీ సిబ్బంది ఉల్లంఘించారని పేర్కొంది.

ఐఐఎంబీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన గోపాల్ దాస్.. కుల వివక్ష కారణంగా తాను ప్రమోషన్ కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిది మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన కులాన్ని కార్యాలయంలో బహిర్గతం చేశారని.. కావాలని ప్రచారం చేశారని ఆరోపించారు. తనకు దక్కాల్సిన అవకాశాలను నిరాకరించారని.. అంతేకాకుండా మానసిక వేధింపులతో పాటు బెదిరింపులకు గురి చేశారని దాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారమే వారంతా అరెస్ట్‌పై స్టే తెచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌ను సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశించింది.

ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశామని.. అయితే ఎఫ్ఐఆర్‌లో నమోదైన పేర్లు గలవారు అదేరోజు సాయంత్రం కోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందారని తెలిపారు. కానీ తమకు ఇంకా ఆర్డర్ కాపీ అందలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

అయితే కొంత మంది విద్యార్థులు.. దాస్‌పై వేధింపుల ఫిర్యాదులు చేశారని.. అందుకోసమే దాస్ ప్రమోషన్ దరఖాస్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐఐఎంబీ స్పష్టం చేసింది. గోపాల్ దాస్.. 2018లో ఐఐఎంబీలో చేరినప్పటి నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అతని అర్హతలను బట్టి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టునే ఆఫర్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అర్హతలు, అనుభవం, 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం జీతం, పరిశోధన, బోధన మరియు వివిధ ప్రోత్సాహకాలను పొందారని తెలిపింది. అంతేకాకుండా ఇనిస్టిట్యూట్‌లో రివ్యూ బోర్డు చైర్‌పర్సన్, కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు కూడా అప్పగించినట్లు సంస్థ వివరించింది. ఇక బోధనలో అయితే దాస్‌కు నచ్చిన కోర్సులనే బోధించాడని పేర్కొంది. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలపై చర్యలు తీసుకుంటామని ఐఐఎంబీ తెలిపింది.

Show comments