Bengaluru: 8 ఏళ్ల వయసున్న బాలిక చెప్పిన అబద్ధం, తప్పుడు ఆరోపణ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రాణాలు మీదికి తీసుకువచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడని చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, అపార్ట్మెమెంట్ లోని ప్రజలు చితకబాదారు. ఈ ఘటన బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. అయితే, బాలిక ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది.
పుడ్ డెలివరీ ఏజెంట్ తనును అక్కడికి తీసుకెళ్లాడని, తప్పించుకోవడానికి తన చేతిని కొరికాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఎవరు ఇలా చేశారని ప్రశ్నించగా.. డెలివరీ ఏజెంట్ వైపు చూపింది. దీంతో కోపోద్రిక్తులు అయిన హౌసింగ్ సొసైటీ నివాసితులు, సెక్యూరిటీ గార్డులు, ఫుల్ డెలివరీ ఏజెంట్ తప్పించుకోకుండా గేట్లు మూసేసి చితకబాదారు. ఇరుగుపొరుగు వారు పోలీసుకు సమాచారం అందించారు. అయితే అప్పటికే అతడిని తీవ్రంగా కొట్టారు.
Read Also: Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకు తెలియడంతో ఏం చేసిందంటే?
పోలీసులు వచ్చిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనను పాప తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న ప్రతీ సెక్యూరిటీ గార్డులతో సహా అందరు కొట్టారని.. ఆమె తప్పుగా తనను ఎందుకు ఇందులో ఇరికించిందో తెలియదని ఫుడ్ డెలివరీ ఏజెంట్ చెప్పారు. తనను రక్షించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడానికి సదరు ఫుడ్ డెలివరీ సంస్థ అతడికి సెలవులు మంజూరు చేసినట్లు తెలిసింది.
ఎందుకు అబద్ధాలు చెప్పావని బాలికను పోలీసులు ప్రశ్నించగా.. క్లాస్ ఉన్న సమయంలో ఆడుకునేందుకు వెళ్లినందుకు తల్లిదండ్రులు కొడతారనే భయంతో అలా చెప్పానని తెలిపింది. ఈ ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు సదరు ఫుడ్ డెలివరీ ఏజెంట్ కి క్షమాపణలు తెలిపారు.