రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. రక్తసంబంధికుల మధ్యే మానవత్వం మంటగలుస్తోంది. తమ స్వలాభం కోసం కడుపున పుట్టిన వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
లక్ష్మీ దుర్గ ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. లక్ష్మీ దుర్గ తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే కుమార్తె వివాహం విషయంలో చాలా రోజులుగా ఇంట్లో తగాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ మధ్య కుమార్తెకు ఓ యువకుడితో సంబంధం చూశాడు. కూతురు చదువు, కెరీర్ కోసం చాలా ఖర్చు చేశానని రూ.40 లక్షలు ఇస్తే పెళ్లి చేయడానికి ఇబ్బంది లేదని వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా లక్ష్మీ దుర్గ జీతాన్ని కూడా తనకే ఇవ్వాలని షరతు పెట్టాడు. అయితే తండ్రి నిర్ణయాన్ని కుమార్తెతో పాటు భార్య కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చాలా రోజులుగా కుటుంబంలో ఘర్షణలు జరుగుతున్నాయి.
అయితే జూలై 25న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో లక్ష్మీ దుర్గ పనిచేస్తున్న ప్రైవేటు కళాశాలకు వచ్చిన నాగేంద్ర.. తన కూతురిని కలవాలని సిబ్బందిని కోరాడు. దీంతో అతడిని కళాశాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ చాంబర్‌లోకి అనుమతించారు. ఆ సమయంలో లక్ష్మీ దుర్గ అక్కడే ఉన్నారు. గదిలోకి వచ్చి రాగానే నాగేంద్ర తన కూతురిపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. పొత్తికడుపు, ఛాతీ, మెడ భాగాల్లో పలుమార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో బాధితురాలి అరుపులతో సిబ్బంది అప్రమత్తమై తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి కుటుంబంలో చాలా కాలంగా కొనసాగుతున్న వివాదాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర తన కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నట్లు వెల్లడించారు. ఓ యువకుడి కుటుంబం వివాహానికి అంగీకరించిన తర్వాత.. కూతురు చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశానంటూ వరుడి కుటుంబం నుంచి రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ డిమాండ్లను అతడి భార్య, కూతురు తీవ్రంగా వ్యతిరేకించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండడంతో సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
తాజా ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేశారు. కళాశాల ప్రాంగణంలోనే జరిగిన ఈ దాడిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ వివాదాలు, వివాహానికి సంబంధించిన ఆర్థిక డిమాండ్లు, దాడికి దారితీసిన ఇతర కారణాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

