NTV Telugu Site icon

Mamata Banerjee: మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం కేసు..

Bengal

Bengal

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. గవర్నర్ సీవి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. సీఎంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై గవర్నర్ శుక్రవారం కలకత్తా హైకోర్టులో కేసు వేశారు. రాజ్‌భవన్‌లో జరుగుతున్న కార్యక్రమాల వల్ల మహిళలు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ పరిణామం ఎదురైంది. గవర్నర్ ఆమె వ్యాఖ్యల్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యలే చేసిన కొంతమంది టీఎంసీ నేతలపై గవర్నర్ పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Read Also: Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..

గురువారం సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సంఘటనల కారణంగా రాజ్‌భవన్ వెళ్లేందుకు భయపడుతున్నామని మహిళలను నాకు చెప్పారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టుని ఆశ్రయించినట్లు, సీఎంతో పాటు పలువురు టీఎంసీ నేతలపై పరువు నష్టం కేసు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

అయితే, ఈ కేసును గురించి టీఎంసీ రాజ్యసభ ఎంపీ డోలా సెన్‌‌ని సంప్రదించినప్పుడు, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ విషయంపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని అన్నారు. మరోవైపు గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. అయితే, చాలా కాలం క్రితమే అతనను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని చెప్పారు. సీఎం, గవర్నర్ మధ్య వైరం రాష్ట్రానికి ఉపయోగపడటం లేదని సీపీఎం సీనియర్ నేత సుజన్ చక్రవర్తి అన్నారు.