NTV Telugu Site icon

Supreme Court: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులు కాదు: సుప్రీం తీర్పు

Supreme Court

Supreme Court

Supreme Court: ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. బీఎడ్‌ పూర్తి చేసిన వారి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేమని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రకటిస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ.. రాజస్థాన్‌లో దేవేశ్‌ శర్మ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ‘ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ను అర్హతగా చేరుస్తూ ఎన్‌సీటీఈ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా, అహేతుకంగా కనిపిస్తోంది. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతుందని.. నాణ్యతలో రాజీపడితే ఉచిత, నిర్బంధ విద్యకు అర్థమే ఉండదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. నాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన ఉత్తమ ఉపాధ్యాయులను నియమించాలని తెలిపింది.

Read also:Pharma Stocks Rise: 2023లో అద్భుతాలు చేసిన ఫార్మా స్టాక్స్.. ఇన్వెస్టర్లకు 120శాతం లాభాలు

డీఎడ్‌ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదువు చెప్పేలా శిక్షణనిస్తారని.. బీఎడ్‌ విద్యార్థులకు మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యార్థులకు బోధించేలా శిక్షణ అందుతుందని.. కాబట్టి బీఎడ్‌ అభ్యర్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేం.. వారిని ఆ పోస్టులకు అర్హులుగా నిర్ణయించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధమన్నారు. ‘ఆర్టికల్‌-21ఎ’లో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని.. కేంద్రప్రభుత్వం వారిని అర్హులుగా ప్రకటించి రాజ్యాంగం, చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఎన్‌సీటీఈ లక్ష్యం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే తప్ప.. బీఎడ్‌ శిక్షణ పొందినవారికి ఉద్యోగావకాశాలు కల్పించడం కాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. డిప్లొమా ఉన్నవారికే పరిమితమైన ప్రాథమిక పాఠశాల టీచర్‌ పోస్టుల్లో బీఎడ్‌వారినీ అనుమతిస్తే డీఎడ్‌ అభ్యర్థుల అవకాశాలు తగ్గిపోతాయని పోతాయని ధర్మాసనం తెలిపింది. ప్రాథమిక పాఠశాల టీచర్లకు డీఎడ్‌ తప్పనిసరి అని నిర్ణయించడం వెనుక ఓ కారణం ఉందని.. అప్పుడప్పుడే బడిలోకి ప్రవేశించిన పిల్లలకు చదువు చెప్పడంలో వారికి తగిన శిక్షణనిస్తారు. తొలిసారి పిల్లలు టీచర్‌కు ఎదురుపడి మాట్లాడేది ఈ దశలోనేనని.. ఆ దశలో విద్యార్థులకు చక్కని పునాది వేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పులో తెలిపింది.

Read also: Indian Flag on Burj Khalifa: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ ఖలీఫాపై భారత జెండా!

ప్రాథమిక పాఠశాలల్లో మంచి అర్హులైన, శిక్షణ పొందిన టీచర్లు అవసరం… డీఎడ్‌తో అలాంటివారు తయారవుతారు.. బీఎడ్‌ అనేది భిన్నమైన అర్హత, శిక్షణ.. అది ఉన్నతమైన అర్హతే అయినప్పటికీ ప్రాథమిక తరగతుల బోధనకు సరిపోదని.. ఈ విషయాన్ని గుర్తించే.. 2018 నాటి నోటిఫికేషన్‌లోనూ బీఎడ్‌ అభ్యర్థులు టీచర్‌గా నియమితులైన తర్వాత తప్పనిసరిగా ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న నిబంధన విధించారు. బీఎడ్‌ అభ్యర్థులు ప్రాథమిక పాఠశాల టీచర్‌ పోస్టులకు అర్హులు కాదని చెప్పడానికి ఇదొక్కటి చాలని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తు చేసింది. 2018 నాటి నోటిఫికేషన్‌ విషయంలో ఎన్‌సీటీఈ సొంతంగా నిర్ణయం తీసుకోకుండా కేంద్రప్రభుత్వం చెప్పినట్లు చేసిందనిపిస్తుందని.. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొనే విధాన నిర్ణయాల్లో రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. నిర్ణయాలు ఏకపక్షంగా, అహేతుకంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా న్యాయ సమీక్షాధికారాలను చేస్తాయని తెలిపింది. విధాన నిర్ణయం పూర్తి ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకున్నట్లుగా ఉందని.. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో నిర్ణయాధికారాన్ని నిపుణులున్న ఎన్‌సీటీఈ వంటి సంస్థకే వదిలిపెట్టాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. అందువల్ల నోటిఫికేషన్‌ను కొట్టేస్తూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాల్సిన టెట్‌ పరీక్షపై ప్రభావం పడే అవకాశం ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెట్‌లో నిర్వహించే పేపర్‌-1 పరీక్షపై ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే చూడాల్సి ఉంది.