PM Modi: పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రమాదాలు, పక్షపాతం గురించి ఆందోళన లేవనెత్తారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో జాగ్రత్తగా, సహకారంతో కూడిన ప్రపంచ పాలన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజం వంటి కీలక రంగాలను ఏఐ ఎలా పునర్నర్మిస్తుందనే విషయాన్ని హైలెట్ చేశారు.
మానవ జీవితాల్లో ఏఐ ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఏఐ ప్రయోజనాలు అందరితో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌తో పంచుకోవాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పక్షపాతాల గురించి కూడా హెచ్చరించారు. “మనం మన వనరులను మరియు ప్రతిభను సమీకరించి, విశ్వాసం, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చడానికి పక్షపాతం లేని నాణ్యమైన డేటాసెట్‌లను అభివృద్ధి చేయాలి. AI అనేది ప్రజల-కేంద్రీకృత అప్లికేషన్ల గురించి ఉండాలి. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం , డీప్ ఫేక్ కి సంబంధించిన ఆందోళనల్ని పరిష్కరించాలి” అని మోడీ చెప్పారు.
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఇతర అనే క రంగాల్లో ఏఐ ఉపయోగాల గురించి మాట్లాడారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు సాధన సులభతరం అయ్యే ప్రపంచాన్ని సృష్టించడంలో ఏఐ సహాయపడుతుందని అన్నారు. ఏఐ ద్వారా అత్యంత భయపడే అంశం ఉద్యోగాల పోవడం అని చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగాల స్వభావం మారుతుందని, కొత్త రకాల ఉద్యోగాలు సృష్టించబడుతాయని చెప్పారు. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం మన ప్రజలు స్కీల్స్, రీ స్కిల్స్ కోసం కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ చెప్పారు.