Bangladeshi MP Murder: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన అతను దారుణహత్యకు గురయ్యాడు. చివరకు అతని డెడ్‌బాడీ కూడా దొరక్కుండా అత్యంత దారుణంగా చర్మాన్ని ఒలిచి, మాంసాన్ని, ఎముకలను వేరు చేసి పలు ప్రదేశాల్లో పారేశారు. ఈ కేసును బెంగాల్ సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జిహాద్ హవ్లాదార్ అనే బంగ్లాదేశీ జాతీయుడితో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహ్మద్ సియామ్ హుస్సేన్ అనే మరో బంగ్లాదేశీయుడిని నేపాల్‌లో అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలోని న్యూటౌన్‌లోని ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వెంటనే దిండుతో ఊపిరాడకుండా, గొంతు నులిమి చంపేసినట్లు మహ్మద్ సియామ్ హుస్సేన్ ఒప్పుకున్నాడని, ఈ హత్యలో ఓ మహిళ కూడా సాయం చేసిందనే విషయాన్ని విచారణలో అంగీకరించాడని సీఐడీ అధికారి తెలిపారు. సదరు మహిళ యూఎస్ జాతీయుడైన అక్తరుజ్జమాన్ స్నేహితురాలని, ఈ కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎంపీని చంపిన తర్వాత, వారు అతని శరీరాన్ని అనేక చిన్న ముక్కలుగా నరికి, వాటిని ప్లాస్టిక్ సంచులలో ఉంచి, వాటిని న్యూ టౌన్, బాగ్జోల కాలువలోని అనేక ప్రాంతాల్లో పడవేసి, వివిధ రహస్య ప్రదేశాలకు పారిపోయారని అధికారి తెలిపారు.
READ ALSO: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్.. భారత్ ఘాటు రిప్లై..
శరీర భాగాల కోసం సీఐడీ వేట సాగిస్తోంది. శరీరంలోని కొన్ని భాగాలను ట్రాలీ సూట్‌కేస్‌లో ఉంచి, బంగ్లాదేశ్ సరిహద్దులోని బంగావ్ సరిహద్దు సమీపంలో పారేసినట్లు సియామ్ అధికారులకు వెల్లడించారు. దక్షిణ 24పరగణాస్ జిల్లాలోని కాలువలో ఇటీవల సీఐడీ మానవ ఎముకల్ని స్వాధీనం చేసుకుంది. ఎంపీకి స్నేహితుడైన అక్తరుజ్జమాన్ నేరంలో పాల్గొన్న వారికి రూ. 5 కోట్లు చెల్లించినట్లు తేలింది. అక్తరుజ్జమాన్‌కు కోల్‌కతాలో ఫ్లాట్ ఉందని, ప్రస్తుతం అమెరికాలో ఉంటాడని సీఐడీ అధికారులు తెలిపారు.
మే 12న బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాకు వచ్చారు. అతనికి పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు డాక్టర్ అపాయింట్మెంట్ కోసం బయటకు వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో బిశ్వాస్ మే 18న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్యపై సమగ్రమైన విచారణ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ని కోరింది.