Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని నటుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కి ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి వెన్నెముకలో విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు.
అయితే, నిందితుడి కోసం మూడు రోజులు పాటు 30 టీమ్‌లతో ముంబై పోలీసులు వెతికారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇలా పలు ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చివరకు అసలైన నిందితుడిని ముంబైకి సమీపంలో థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని పోలీసులు తేల్చారు. బంగ్లాకు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్, సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. నగరంలో అంతటా సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసి నిందితుడిని గుర్తించారు. చివరకు అంధేరిలోని డీఎన్ నగర్‌లోని సీసీటీవీ ద్వారా ఇతడిని గుర్తించారు. నిందితుడు బైక్ దిగినట్లు ఇందులో కనిపించింది. బైక్ నెంబర్ ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు.
Read Also: Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….
స్థానిక నిఘా సమాచారం ప్రకారం.. పోలీసులు వర్లిలోని కోలివాడలో అద్దెకు తీసుకున్న గెస్ట్ హౌజ్‌పై దృష్టి సారించారు. అక్కడే నిందితుడు మరో ముగ్గురితో కలిసి నివసిస్తున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. గెస్ట్ హౌజ్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా, పోలీసులు నిందితుడి ఫోన్ నెంబర్, పేరు ఇతర సమాచారాన్ని సంపాదించారు. ఫోన్ ద్వారా అతడు ఉన్న స్థానాన్ని ట్రాక్ చేశారు. నిందితుడు థానేలోని నిర్జన రహదారిలోని ఒక పొదల్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అన్ని వైపుల చుట్టుముట్టిన పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు.
షరీఫుల్ భారత్‌లో ఉండేందుకు ఎలాంటి అనుమతి లేదని, అతడి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, అతడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో, టీవీలో తన చిత్రాలను చూసి థానే పారిపోయినట్లు షరీఫుల్ పోలీసులకు చెప్పాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి థానేలోని ఒక లేబర్ క్యాంప్ సమీపంలో దాక్కున్నాడు.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు తనకు తెలియదని నిందితుడు చెప్పాడు. అయితే, తనకు ఉద్యోగం లేదని, దీంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్లాన్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం లోపలికి వెళ్లడానికి వెనుక మెట్లు మరియు ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌లను ఉపయోగించానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. భవనంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అని కూడా అతను చెప్పాడు. నిందితుడితో కలిసి సీన్ రీకన్‌స్ట్రక్చన్ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.