Bangladesh: వివాదాస్పద బంగ్లాదేశ్ విద్యార్థి నేత, గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఎగిసిపడేందుకు కారణమైన విద్యార్థి నేత నహిద్ ఇస్లాం కొత్త రాజకీయ పార్టీని శుక్రవారం ప్రారంభించాడు. ఇతనే షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంలో, హసీనా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. ఢాకాలో కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్‌ను ఎగిసిపడిన స్టూడెంట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ (SAD) ఉద్యమానికి నాయకత్వం వహించిన నహిద్, కొత్త పార్టీకి ‘జాతియా నాగోరిక్ పార్టీ’ లేదా నేషనల్ సిటిజన్ పార్టీగా పేరు పెట్టారు.
షేక్ హసీనా తన పదవి నుంచి దిగిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో నహిద్ ఇస్లాం టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పోస్ట్స్ మంత్రిత్వ శాఖ సలహాదారుగా పనిచేశారు. అయితే, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ‘‘బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశాన్ని నిర్మిస్తాము’’ అని తన పార్టీ ప్రారంభ కార్యక్రమంలో చెప్పాడు.
Read Also: TG Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
విద్యార్థి నేతగా ఉన్న నహిద్ ఇస్లాం, దేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాడు. షేక్ హసీనా ఢాకా నుంచి ఢిల్లీ వచ్చిన తర్వాత, ఇతను బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్‌లతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. మహ్మద్ యూనస్‌ని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉండేందుకు ఒప్పించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా పార్టీకి ప్రత్యామ్నాయంగా తన పార్టీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన రాజీనామా, పార్టీ ఏర్పాటు వెనక మహ్మద్ యూనస్ ఉన్నారనే వాదన కూడా ఉంది. గతేడాది, బంగ్లాదేశ్ హింసలో హిందువులపై దాడులను నహిద్ ఇస్లాం ఏ మాత్రం ఖండించలేదు.