NTV Telugu Site icon

Bihar: సన్యాసిగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్..

Bihar

Bihar

Bihar: భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులు ఇటీవల కాలంలో పట్టుబడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌‌కి చెందిన మరో వ్యక్తిని బీహార్ గయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. బాబు జో బారువా అలియాస్ రాజీవ్ దత్తాగా పేరు మార్చుకున్న వ్యక్తి గత 8 ఏళ్లుగా ఇండియాలో బౌద్ధ సస్యాసిగా నటిస్తూ అక్రమంగా నివసిస్తున్నాడు.

Read Also: Bangladesh: భారత్‌ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..

శుక్రవారం థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన అతడిని విమానాశ్రయ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను సరైన పాస్‌పోర్ట్, వీసా లేకుండా నివసిస్తున్నట్లు, నకిలీ పత్రాలు ఉపయోగిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ఇతడిపై గతంలో లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం అతడిని గయాలోని మగద్ మెడికల్ పోలీస్ స్టేషన్ తరలించారు.

ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ తనిఖీల సమయంలో అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 8 ఏళ్లుగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుడిగా గుర్తించారు. వివిధ పేర్లలో అనేక పాస్‌పోర్టులతో సహా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తో సహా అనేక రకాల పత్రాలు ఉన్నాయి. 1560 థాయ్ కరెన్సీ, రూ. 3800 భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.