NTV Telugu Site icon

Bangladesh: నమాజ్, అజాన్ సమయంలో హిందువులు దుర్గాపూజని నిలిపేయండి..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చేలా చేశాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేసి దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. హిందూ వ్యాపారాలను, ఆలయాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ దేశంలో హిందువుల పరిస్థితి చక్కబడుతోంది.

ఇదిలా ఉంటే దుర్గాపూజ సందర్భంగా అక్కడి హిందూ సమాజాన్ని బంగ్లా ప్రభుత్వ కీలక కోరిక కోరింది. ముఖ్యంగా అజాన్, నమాజ్ సమయాల్లో దుర్గాపూజకు సంబంధించిన కార్యక్రమాలను ముఖ్యంగా సంగీతాన్ని నిలిపేయాలని హిందూ సమాజాన్ని కోరింది. హోం వ్యవహరాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) ఎండీ జహంగీర్ అలం చౌదరి మాట్లాడుతూ.. సంగీత వాయిద్యాలను, సౌండ్ సిస్టమ్స్‌ని స్విచ్ ఆఫ్‌లో ఉంచాలని పూజాకమిటీలను కోరామని, అందుకు వాళ్లు అంగీకరించారని చెప్పారు. ‘‘నమాజ్ సమయంలో దుర్గా పూజ కార్యక్రమాలను నిలిపేయాలి. అజాన్‌కి ఐదు నిమిషాల ముందు నుంచి విరామం పాటించాలి’’ అని చెప్పారు.

Read Also: Donald Lu: అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూతో రాహుల్ గాంధీ భేటీ.. ఎవరితను..? బంగ్లా, పాక్‌లో ఏం చేశాడు..?

బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి దుర్గా పూజా అనేది అతిపెద్ద పండగ. ఇటీవల జరిగిన మతఘర్షణల్ని దృష్టిలో పెట్టుకుని బంగ్లా ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ ఏడాది బంగ్లా వ్యాప్తంగా 32,666 పూజా మండపాలను ఏర్పాటు చేయనున్నట్లు చౌదరి తెలిపారు. వీటిలో 157 మండపాలు ఢాకా సౌత్ సిటీలో మరియు 88 నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. విగ్రహాల తయారీ నుంచి పండగ సమయంలో భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు.

మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ మత సామరస్యానికి పిలుపునిచ్చాడు. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ‘‘మనది మత సామరస్యం ఉన్న దేశం. మత సామరస్యాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను కూడా ఎవరూ చేయరు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. ఎవరైనా అల్లర్లకి కారణమైతే వారిని ఖచ్చితంగా శిక్షిస్తాం’’ అని అన్నారు.