Site icon NTV Telugu

Bangalore: అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3వేలు జరిమానా

Bangalore Police

Bangalore Police

Bangalore: బెంగళూరులో వింత చోటు చేసుకుంది. అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు ఓ జంటకు పోలీసులు రూ.3వేలు జరిమానా విధించారు. ఈ మేరకు వివరాలను కార్తీక్ పత్రీ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాము మాన్యతా టెక్ పార్క్ వెనుక ఉన్న సొసైటీలో నివసిస్తున్నామని.. గత రాత్రి తన భార్యతో కలిసి స్నేహితుడి ఇంటికి కేక్ కటింగ్ కార్యక్రమానికి వెళ్లామని.. తిరిగి ఇంటికి వెళ్తుండగా పోలీసులు ఆపి తమను వేధించారని ఆరోపించాడు. అర్ధరాత్రి రోడ్డుపై నడవడం నేరమంటూ ఇద్దరు పోలీసులు తమకు చెప్పారని.. రూ.3వేలు జరిమానా కట్టాలని వేధింపులకు గురిచేశారని తెలిపాడు. ఈ రూల్ ఎక్కడ ఉందని తాము ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని బెదిరించారని కార్తీక్ పత్రీ వాపోయాడు. తాము పోలీసులను ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదని.. చివరకు తన భార్య ఏడ్చేసిందని వివరించాడు.

Read Also: Team India: 300 వ్యక్తిగత సెంచరీలు.. వన్డేల్లో టీమిండియా అరుదైన రికార్డు

తాము అడిగిన డబ్బులు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు వేధించారని కార్తీక్ పత్రీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాసేపటి తర్వాత ఓ కానిస్టేబుల్ తనను పక్కకు తీసుకెళ్లి బేరాలు ఆడాడని.. కనీసం రూ.1,000 ఇస్తే వదిలేస్తామని చెప్పాడని తెలిపాడు. అనంతరం పేటీఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తాను రూ.1,000 చెల్లించినట్లు రాసుకొచ్చాడు. ఇంటికి వెళ్లాక తమకు నిద్ర కూడా పట్టలేదని.. చాలా భయం వేసిందని.. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్తీక్ పత్రీ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడి ట్వీట్ పట్ల బెంగళూరు పోలీసులు స్పందించారు. సంపిగహళ్లి పోలీస్ స్టేషన్‍కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు వివరించారు.

Exit mobile version