Road Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాట్‌పత్ జిల్లాలో 32 మంది ప్రమాణికులతో వెళ్తున్న పికప్ ట్రక్ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 16 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఖేక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్టర్న్ పెరఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రాజస్థాన్ నుంచి బదాయూన్ వెళ్తున్న ప్రయాణికులు ఉన్నారు. వీరు రాజస్థాన్ లోని బాగడ్ ధామ్ నుంచి తిరిగి వస్తున్న భక్తులని పోలీసులు తెలిపారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరారు. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో వాహనం బోల్తా పడిందని, ఆ తర్వాత క్షతగాత్రులు ఆర్తనాదాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెనక నుంచి వచ్చని మరో వాహనం ఢీకొట్టడంతోనే పికప్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టినట్లు డ్రైవర్ చెబుతున్నాడు. అయితే డ్రైవర్ చెప్పింది నిజమా అని పోలీసులుె నిర్ధారించాల్సి ఉంది.

