Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఈ హత్యకు బాధ్యత ప్రకటించింది. సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీంకి మద్దతుగా ఉండటంతోనే హత్య చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పతనమయ్యాయని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ధరమ్ రాజేష్ కశ్యప్ తాను మైనర్‌ని అని, తన వయసు 17 ఏళ్లు అని పేర్కొన్నాడు. కానీ దీనిని ప్రాసిక్యూషన్ తోసిపుచ్చుతూ.. అతను 2003లో జన్మించాని కోర్టు వెల్లడించారు. మరో నిందితుడు గుర్‌మైల్ సింగ్(24)కి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. ఇద్దరు నిందితులను ఆదివారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ధరమ్ రాజేష్ సింగ్ తాను మైనర్ అని పేర్కొనడంతో అతడిని వయసుని నిర్ధారించేందుకు ‘‘బోన్ అసిఫికేషన్’’ టెస్ట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. శరీరంలోని కొన్ని ఎముకల ఎక్స్-రేని పరిశీలించడం ద్వారా వ్యక్తి వయసుని అంచనా వేయడాన్ని బోన్ అసిఫికేషన్ టెస్ట్‌గా చెబుతారు. ఈ టెస్ట్ ద్వారా కశ్యప్ వయసుని నిర్ధారించనున్నారు.
అయితే, కోర్టులో విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ గౌతమ్ గైక్వాడ్ దీనిని వ్యతిరేకించారు. శనివారం రాత్రి కాల్పులు జరిగిన ప్రాంతంలో నిందితుడి ఆధార్ కార్డ్‌ని స్వాధీనం చేసుకున్నారని, అందులో కశ్యప్ మార్చి 1, 2003లో జన్మించినట్లు చూపిస్తుందని అన్నారు. నిందితుడి ఆధార్ కార్డును అందచేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ కార్డులో కశ్యప్ ఫోటో ఉందని, అయితే పేరు రంజన్ కుమార్ గుప్తాగా ఉందని చెప్పారు. కశ్యప్ ఆధార్ కార్డ్ తనదేనా అని తెలిపేందుకు అతడి బొటన వేలి ముద్రని తీసుకోవాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కశ్యప్ వయసుని రుజువు చేసేందుకు ముంబై పోలీసులు సంబంధిత పత్రాలతను కోర్టుకు తీసుకురావాలని మెజిస్ట్రేట్ కోరారు.
Read Also: Maoist Party: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌటర్‌పై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన.. బలగాలపై ఆరోపణలు
ఇద్దరు నిందితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ.. కశ్యప్ తాను మైనర్‌ని అని తనకు ఆదేశాలు ఉన్నాయని, ప్రాసిక్యూషన్ వద్ద అతని వయసు నిరూపించేందుకు పత్రాలు ఉంటే, అతను దీనిపై సమస్య లేవనెత్తడని చెప్పారు. నిందితుడి వద్ద ఎటువంటి జనన ధృవీకరణ పత్రం లేదా అతని వయస్సును ధృవీకరించడానికి పాఠశాల విడిచిపెట్టిన ధృవీకరణ పత్రం లేదని, కశ్యప్ ఎముక ఆసిఫికేషన్ పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.
కాల్పులకు సంబంధించి నిందితులు ఎక్కడ శిక్షణ పొందారు..? కేసు దర్యాప్తు చేయడానికి కాకుండా తదుపరి నేరాలను అడ్డుకోవడాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏదైనా రాజకీయ శత్రుత్వంతో నేరం జరిగిందా..? అని విచారణ చేయాలని ప్రాసిక్యూషన్ గైక్వాడ్ కోర్టులో వాదించారు. శివకుమార్‌తో సహా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, మరోకరు ముగ్గురు ప్రధాన నిందితులకు లాజిస్టిక్ సపోర్ట్ అందించారని ఆయన తెలిపారు. నిందితుల తరుపు అడ్వకేట్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితులు నిజంగా నేరం చేశారా..? లేదా అని తేల్చాలని అన్నారు. మరణించిన వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకుడు, మరొకరు దీనిని చేసి ఉండొచ్చని, నిందితులను ఇరికిస్తున్నారని అగర్వాల్ వాదించారు.