Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ మందిరానికి భక్తులు కానుకగా సమర్పించిన వెండి ఇటుకల చుట్టూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. మందిరానికి విరాళంగా వచ్చిన వెండి ఇటుకలకు ఎలాంటి లెక్కాపత్రం లేదని, అవి మాయమయ్యాయంటూ పలువురు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. రామాలయ విరాళాల వివాదంపై దర్యాప్తు చేస్తున్న సిట్, వెండి ఇటుకలకు సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలింది. ముఖ్యంగా అనురాగ్ రస్తోగి అనే వ్యక్తి విరాళంగా ఇచ్చిన వెండి ఇటుకలకు సంబంధించి చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సిట్ స్పష్టం చేసింది.
రికార్డుల్లో పక్కాగా లెక్కలు..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రికార్డుల ప్రకారం.. భక్తులు ఇచ్చిన ప్రతి వెండి వస్తువుకు పక్కాగా లెక్కలు ఉన్నాయి. రికార్డుల ఆధారంగా, మొదటిసారిగా 2020 జూలై 21 నుంచి జూలై 28 మధ్య కాలంలో మొత్తం 38 కిలోల వెండి విరాళంగా వచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది జూలై 29న మరో 25.576 కిలోల వెండి ఇటుకలు ట్రస్ట్‌కు అందినట్లు రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేశారు. ఈ దర్యాప్తులో వెల్లడైన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. విరాళంగా వచ్చిన వెండి ఇటుకలు ఎక్కడికీ మాయం కాలేదు. ట్రస్ట్ నిబంధనల ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా ఆ వెండి ఇటుకలన్నింటినీ కరిగించి, సురక్షితమైన రూపంలోకి మార్చి బ్యాంకు లాకర్లలో భద్రపరిచారు. దీంతో వెండి ఇటుకలు కనిపించకుండా పోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని సిట్ తేల్చిచెప్పింది.
8 మంది అరెస్ట్..
వెండి ఇటుకల వ్యవహారానికి క్లారిటీ వచ్చినప్పటికీ.. ఆలయ విరాళాల లెక్కింపులో జరిగినట్లు చెప్తున్న కొన్ని ఇతర అవకతవకలపై దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతోంది. సిట్ సిఫార్సుల మేరకు ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై విరాళాల సొమ్ము దొంగతనం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, అవినీతి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు, సిట్ రెండు వేర్వేరు కోణాల్లో ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి.
లోపాలు ఎక్కడ జరిగాయంటే..
అధికారుల ప్రాథమిక విచారణలో ఉద్యోగుల నిఘా, నగదు లెక్కింపు ప్రక్రియ, సీసీటీవీల నిర్వహణ, మందిరం నుంచి బ్యాంకుకు విరాళాల సొమ్మును తరలించే విధానంలో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపాల ఆధారంగానే దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, రామమందిరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు మరో కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మొత్తం మీద విరాళాల లెక్కింపు అక్రమాలపై దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉండగా.. వెండి ఇటుకల మాయంపై వచ్చిన వార్తలను మాత్రం సిట్ రికార్డుల ఆధారంగా కొట్టిపారేసింది. ఈ ఫేక్ న్యూస్‌ను వైరల్ చేసిన వారిపై, అలాగే విరాళాల అక్రమాలకు పాల్పడిన అసలైన దోషులపై కఠిన చర్యలు ఉంటాయని దర్యాప్తు సంస్థలు స్పష్టంగా హెచ్చరించాయి.

