Ayatollah Khamenei: మిడిల్ ఈస్ట్ రగులుతోంది. ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమర్చారు. ఖమేనీతో పాటు టాప్ రాజకీయ, సైనిక నేతల్ని చంపేసినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ కూడా ప్రతీకార దాడుల తీవ్రత పెంచింది. ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, బహ్రైయిన్ ఇలా మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఖమేనీ మరణం పాకిస్తాన్‌లో చిచ్చుపెట్టింది. ఖమేని మరణం తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్‌లో నిరసనకారులు తీవ్ర నిరసన తెలిపారు. భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో షియా ముస్లింలు నిరసనలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లక్నో, హైదరాబాద్, బెంగళూర్ వంటి ప్రాంతాల్లో ఖమేనీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, ఖమేనీ మృతిపై అనేక ఇస్లామిక్ మౌనంగా ఉన్నాయి. భారత్ కూడా ఖమేనీ మృతిపై సంతాపం వ్యక్తం చేయలేదు. ఘర్షణలు తగ్గేలా ఇరు పక్షాలు చర్చల్ని ఆశ్రయించాలని మాత్రమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ నిజంగా భారత్ పక్షాన నిలిచారా? లేదా? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ వైఖరిని ప్రతిబింబిచేలా ఇరాన్ సుప్రీంలీడర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
2017-2024 మధ్య కాలంలో ఖమేనీ చాలా కాలం భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు. వీటి కారణంగా ఖమేనీని ‘నిజమైన భారత మిత్రుడు’’ అని పిలువలేమని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు.
* కాశ్మీర్ అంశం: 2017, 2019లలో కాశ్మీర్ అంశాన్ని ఖమేనీ ప్రస్తావించారు. కాశ్మీర్‌లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, వారికి మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ వలే ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
* ఆర్టికల్ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఖమేనీ దీనిపై మాట్లాడుతూ.. ‘‘న్యాయమైన విధానం ’’ అవలంభించాలని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ ఇరాన్ రాయబారిని పిలిపించి అభ్యంతరం తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ఖండించింది.
*CAA , ఢిల్లీ అల్లర్లు : బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) విమర్శించడమే కాకుండా, 2020 ఢిల్లీ అల్లర్లలో ముస్లింలపై ‘‘మారణహోమం’’ అని వ్యాఖ్యానించారు. ఈ అల్లర్లతో భారత్ ఇస్లామిక్ దేశాల్లో ఒంటరి అవుతుందని హెచ్చరించారు. అతివాద హిందువుల్ని ఎదుర్కోవాలని పిలుపునివ్వడం గమనార్హం. దీనికి ప్రతిగా భారత్ స్పందిస్తూ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని చెప్పింది.
*గాజాతో పోలిక: 2024లో భారత్‌ను మయన్మార్, గాజాతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు తప్పుడు సమాచారం ఆధారంగా, అంగీకారయోగ్యం కానివని భారత్ అభివర్ణించింది.
ఇరాన్‌పై భారత ప్రభుత్వ వైఖరి:
ఇరాన్ భారత్‌కు మిత్రదేశమైనప్పటికీ పలు సందర్భాల్లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓట్ వేసింది. 2005, 2006,, 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం కోసం అమెరికాకు మద్దతుగా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)లో మూడుసార్లు ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసింది. 2022లో ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో తటస్థంగా ఉంటూ, ఓటింగ్‌కు దూరంగా ఉంది.
