Site icon NTV Telugu

Calcutta High Court: వక్షోజాలను టచ్ చేయడం ‘‘అత్యాచారం కాదు’’, కానీ..

Calcutta High Court

Calcutta High Court

Calcutta High Court: బాధితురాలి వక్షోజాలను పట్టుకునే ప్రయత్నం ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ కిందకు వస్తుందని, ‘‘అత్యాచారం’’, ‘‘అత్యాచారం ప్రయత్నం’’ కాదని పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) చట్టం కింద నిందితుడిని దోషిగా శిక్ష విధించిన ట్రయర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు శుక్రవారం సస్పెండ్ చేస్తూ, ఈ తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు తన విచారణలో నిందితుడు ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’ మరియు ‘‘అత్యాచార ప్రయత్నం’’ రెండింటిలోనూ దోషిగా నిర్ధారించారు. అతడికి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

అయితే, దీనిపై అప్పీల్‌ని విచారించిన జస్టిస్ అరిజిత్ బెనర్జీ మరియు జస్టిస్ బిశ్వరూప్ చౌదరిలతో కూడిన డివిజన్ బెంచ్, ఈ కేసులో బాధితురాలి వైద్య పరీక్షలను హైలెట్ చేస్తూ, అత్యాచారం జరగలేదని పేర్కొంది. బాధితురాలి వాదన ప్రకారం, నిందితుడు మద్యం మత్తులో బాలిక వక్షోజాలను తడుమడానికి ప్రయత్నించాడని కోర్టు గమనించింది.

Read Also: Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..

ఇటువంటి ఆధారాలు పోక్సో చట్టం-2012 సెక్షన్ 10 ప్రకారం, తీవ్రమైన లైంగిక దాడి అభియోగాలకు మద్దతు ఇస్తాయని, కానీ ప్రాథమికంగా అత్యాచారానికి ప్రయత్నించిన నేరాన్ని సూచించవని కోర్టు పేర్కొంది. తుది విచారణ తర్వాత, ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’, ‘‘అత్యాచార ప్రయత్నం’’ అభియోగాలను ‘‘తీవ్రమైన లైంగిక దాడి’’గా తగ్గించారు. దీంతో దోషికి శిక్ష 12 సంవత్సరాల నుంచి 5-7 మధ్య తగ్గించబడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ప్రత్యేక కేసులో దోషి ఇప్పటికే 28 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అప్పీల్ నిర్ణయించే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, ఏది ముందుగా వస్తే అది వరకు దోషిగా నిర్ధారణ మరియు శిక్షను సస్పెండ్ చేయాలని బెంచ్ ఆదేశించింది. అప్పీల్ పూర్తయ్యే వరకు జరిమానా చెల్లింపును కూడా నిలిపివేసింది.

గతంలో అలహాబాద్ హైకోర్టు ఇలాంటి తీర్పును ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఒక నెల క్రితం అలహాబాద్ హైకోర్టు ఒక అమ్మాయి రొమ్ములను పట్టుకోవడం, ఆమె పైజామా దారాన్ని తెంచడం, ఆమెను కల్వర్ట్‌లోకి లాగడానికి ప్రయత్నించడం అనేది అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదని పేర్కొంది. ఈ తీర్పుపై చాలా విమర్శలు వచ్చాయి.

Exit mobile version