NTV Telugu Site icon

Karnataka Toll gate: టోల్‌ సిబ్బందిపై దాడి.. ఒకరు మృతి

Toll

Toll

Karnataka Toll gate: ఈ మధ్య కాలంలో టోల్‌గేట్ల దగ్గర గొడవలు పెరిగిపోతున్నాయి. టోల్‌గేట్‌ దగ్గర పేమెంట్ చేసే సమయంలో కొంత ఆలస్యం అవుతుండటంతో ప్రయాణీకులు ఓపిక లేకుండా టోల్‌ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. అటువంటి ఘటనే ఆదివారం కర్ణాటకలో జరిగింది. వారు కారులో ప్రయాణం చేస్తున్నారు. వారి కారు టోల్‌గేట్‌ దగ్గరకు వచ్చింది. టోల్ గేట్‌ తీసే వ్యక్తి కొంత ఆలస్యం చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన కారులోని ప్రయాణీకులు టోల్‌ సిబ్బందిపై దాడికి దిగారు. ప్రయాణీకుల దాడిలో టోల్‌ సిబ్బందిలో ఒకరు మృతి చెందారు. ఆదివారంనాడు రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Read also: JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త.. తెలంగాణలోని 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు

బెంగుళూరుకు 35 కి.మీ దూరంలోని రామనగరలోని బిడది టోల్ గేట్ వద్ద ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. నిందితులు బెంగుళూరుకు చెందిన వారిగా గుర్తించినట్టు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు కారులో మైసూరు వెళ్తున్నారు. ఈ కారు టోల్ ప్లాజా వద్దకు వచ్చిన సమయంలో టోల్ ప్లాజా బారియర్ ఎత్తడంలో టోల్ ప్లాజ్ సిబ్బంది జాప్యం చేశారు. దీంతో కోపంతో కారులోని నలుగురు వ్యక్తులు టోల్ సిబ్బందితో గొడవకు దిగారు. గొడవను సద్దు మణచేందుకు స్థానికులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. దీంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. టోల్ ప్లాజా కు కొద్దిదూరంలో వారు కారులోనే వేచి ఉన్నారు. భోజనం కోసం టోల్‌ సిబ్బంది రాత్రి 12 గంటల సమయంలో బయటకు వచ్చారు. టోల్‌ సిబ్బందిలోని పవన్ కుమార్ అతని సహోద్యోగి టోల్ ప్లాజా నుండి బయటకు రాగానే నిందితులు హాకీ స్టిక్స్ తో దాడికి దిగి పారిపోయారు. ఈ దాడిలో పవన్ కుమార్ మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.