NTV Telugu Site icon

Atiq Ahmed: కొడుకు ఎన్‌కౌంటర్‌తో ప్రాణం విలువ తెలిసినట్లుంది.. కోర్టులోనే గుక్కపెట్టి ఏడ్చిన అతీక్ అహ్మద్

Atiq Ahmed

Atiq Ahmed

Atiq Ahmed: 100కు పైగా నేరాాలు, అనేక హత్యలు, బెదిరింపులు ఇలా ఓ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ నేర సామ్రాజ్యాన్ని, రాజకీయాలను శాసించిన గ్యాంగ్ స్టర్ కం పొలిటీషియన్ అతీక్ అహ్మద్ కు ప్రాణ భయాన్ని చూపిస్తున్నారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. చివరకు జైలు నుంచి భయటకు వస్తే ఎక్కడ ఎన్‌కౌంటర్‌లో హతమవుతానో అని భయపడుతున్నాడు. యూపీకి వెళ్లాలంటేనే భయపడి చస్తున్నాడు. తాజాగా ఈ రోజు అతని కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలో కీలక నిందితులుగా అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, షూటర్ గులాం ఉన్నారు. వీరిద్దరు గత కొంతకాలం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. అయితే వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గురువారం మధ్యాహ్నం ఝాన్సీ సమీపంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్ (ఎస్టీఎఫ్) టీం జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు హతం అయ్యారు.

Read Also: Yogi Adityanath: అతిక్ అహ్మద్ కొడుకు ఎన్‌కౌంటర్.. ఎస్టీఎఫ్ టీంపై సీఎం ప్రశంసలు.. అత్యవసర సమావేశం..

గురువారం హతుడు అసద్ తండ్రి గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను ప్రయాగ్ రాజ్ కోర్టులో చీప్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అతీక్ తో పాటు అతని సోదరుడు అష్రఫ్ ను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇదే రోజు అతని కొడుకు ఎన్ కౌంటర్ జరగడం, ఆ వార్త కోర్టులో ఉన్న సమయంలో అతీక్ అహ్మద్ కు తెలియడంతో విపరీతంగా ఏడ్చాడు. కోర్టు హాల్ లోనే కుప్పకూలిపోయాడు. తన అన్న కుమారుడు ఎన్ కౌంటర్ లో మరణించాడని తెలిసి అష్రఫ్ షాక్ కు గురయ్యాడు.

ఈ ఎన్‌కౌంటర్‌కు డిప్యూటీ ఎస్పీ నావేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నాయకత్వం వహించారు. అసద్, గులాం ఇద్దరి తలలపై రూ. 5 లక్షల నజరానా ఉంది. ఒకటిన్నర నెలలుగా అసద్, గులామ్ లను ట్రాక్ చేస్తున్నట్లుగా యూపీ ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్ తెలిపారు. బైకుపై పారిపోతున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కేవలం 5 నిమిషాల్లోనే ఇద్దరు నిందితులు నేలకొరిగారు. చనిపోయిన నిందితుల వద్ద పలు అత్యాధునిక విదేశీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Show comments