Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తి చేశారు. హిందువులు, ముస్లింల మధ్య జనాభా వ్యత్యాసం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. హిందువుల జనాభా తగ్గడం, ముస్లిం జనాభా పెరగడం జనాభా సమతుల్యాన్ని గణనీయంగా సవాల్ చేస్తుందని పేర్కొన్నారు. జనాభా మార్పుల కారణంగా అస్సాంలోని స్థానిక ప్రజలు 12-13 జిల్లాల్లో మైనారిటీలుగా మారుతున్నారని శర్మ హైలైట్ చేశారు.
ఒకప్పుడు రాష్ట్రంలో 60-65 శాతం ఉన్న హిందువుల జనాభా ఇప్పుడు దాదాపుగా 57 శాతంకి పడిపోయింది. 2021 నాటికి ముస్లిం జనాభా 41%కి పెరిగిందని చెప్పారు. కుటుంబ నియంత్రణ నిబంధనలను అన్ని వర్గాలు పాటించాలని ఆయన కోరారు. బహుభార్యత్వానికి వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేశారు. జనాభా సమతుల్యతనను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మన దేశ భూమి, ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 167 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని ప్రభుత్వం ఆక్రమణదారుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధానంగా ఒకే వర్గానికి చెందిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గోల్‌పరా జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు వారి భూమిని ఇతరులకు విక్రయించకుండా పటిష్టమైన చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు.
Read Also: Paris Olympics: ప్రధానితో పారిస్ ఒలింపిక్స్ విజేతల భేటీ..వీడియో వైరల్
కోచ్-రాజ్‌బోంగ్షి, బోడో మరియు రభా వంటి వర్గాల భూమి హక్కులను కాపాడేందుకు, రాబోయే అసెంబ్లీ సమావేశంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. భూమి రక్షణను నిర్ధారించడానికి ఇప్పటికే ఉన్న గిరిజన ప్రాంతాల వెలుపల మైక్రో ట్రైబల్ బెల్ట్‌ల ఏర్పాటును కూడా శర్మ ప్రస్తావించారు. అక్టోబర్ 2 నుంచి అస్సాం ప్రభుత్వం మిషన్ బసుంధర మూడో విడతను ప్రారంభించనునంది. ఇది గౌహతి కొండల్లోని ఆదివాసీలకు భూమిపై హక్కులను కల్పించే లక్ష్యాన్ని కలిగి ఉంది. తేయాకు తోట భూమిని కార్మికులకు తిరిగి ఇచ్చే ప్రణాళికను కూడా ఆయన ప్రకటించారు. భూసంస్కరణలతో పాటు, స్థానికులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేలా రాష్ట్ర నివాస విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.