NTV Telugu Site icon

వీర‌వ‌నితః క‌రోనా రోగిని వీపుపై మోసి…

క‌రోనా స‌మ‌యంలో ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు.  నేను, నా కుటుంబం బ‌తికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి.  అయితే, ఇలాంటి స‌మ‌యంలో ఓ మ‌హిళ త‌న వీపుపై క‌రోనా రోగిని ఎక్కంచుకొని న‌డుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.   అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మ‌హిళ నిహారిక మామ క‌రోనా బారిన ప‌డటంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్న‌ది.  న‌గోల్ న‌గ‌రం స‌మీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో నివ‌శించే నిహారిక మామ క‌రోనా బారిన ప‌డ‌టంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు ఆటోను పిలిపించింది.  కానీ, రోడ్డు బాగాలేక‌పోవ‌డంతో ఆటో రాలేదు.  దీంతో తులేశ్వ‌ర్ దాస్‌ను వీపుపై ఎక్కించుకొని హెల్త్ కేర్ సెంట‌ర్‌కు తీసుకెళ్లింది.  క‌రోనా తీవ్రంగా ఉండ‌టంతో న‌గోల్ కు తీసుకెళ్లింది.  న‌గోల్ ప్రైవేట్ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డ బెడ్ లేక‌పోవ‌డంతో మరో ఆసుప‌త్రికి రిఫ‌ర్ చేశారు.  అక్క‌డి నుంచి నిహారిక మామ‌ను వీపుపై ఎక్కించుకొని మ‌రో ఆసుప‌త్రికి తీసుకెళ్లింది.  కొంత‌మంది ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది.  ఆమెను ఇంట‌ర్యూ చేసేందుకు అనేక మీడియా సంస్థ‌లు క్యూలు క‌ట్టాయి.  తన‌కు విధిలేని ప‌రిస్థితుల్లో అలా చేయాల్సి వ‌చ్చింద‌ని, ఇలాంటి స‌మ‌యంలోనే ఒక‌రికొక‌రు తోడుగా ఉండాల‌ని నిహారిక పేర్కొన్న‌ది.  రెండు గంట‌ల‌పాటు క‌రోనా రోగిని వీపుపై మోయ‌డంతో ఆమెకు కూడా క‌రోనా సోకింది.  అయిన‌ప్ప‌టికి భ‌య‌ప‌డ‌కుండా ధైర్యంగా ఉండ‌టం విశేషం.