Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.
Read Also: Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !
దాడి తర్వాత ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం ఇంఫాల్, చురాచంద్‌పూర్ మధ్యలో ఉంది. మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా ఈ దాడిని ఖండించారు. విధి నిర్వహణలో మరణించిన సైనిక కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఇలాంటి హింసాత్మక ఘటనల్ని సహించబోమని ఆయన అన్నారు.
మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు, ఇది రాష్ట్రానికి “క్రూరమైన దెబ్బ” అని అన్నారు. ఘటన సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 33 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు జవాన్లను కోల్పోవడం దారుణమైన దెబ్బగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
