Site icon NTV Telugu

Himanta Biswa Sharma: బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన వేళ.. అస్సాం ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Himanta Biswa Sharma

Himanta Biswa Sharma

Himanta Biswa Sharma: బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ జోడో యాత్ర గురించి అస్సాం సీఎం హిమంతను మీడియా ప్రశ్నించగా.. ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘భారత్‌ ఇప్పుడు ఐక్యంగానే ఉంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. సిల్చార్‌ నుంచి సౌరాష్ట్ర వరకు మనమంతా ఒకటే. ఈ దేశాన్ని కాంగ్రెస్సే భారత్, పాకిస్థాన్‌గా విభజించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఒకవేళ తన కుటుంబం చేసిన తప్పులకు రాహుల్‌ బాధపడితే.. మన దేశంలో ‘భారత్‌ జోడో’ చేపట్టడం కాదు.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను ఏకీకృతం చేసి అఖండ్‌ భారత్‌ కోసం కృషి చేయాలి’’ అని హిమంత బిశ్వ శర్య వ్యాఖ్యలు చేశారు.

Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..

ఇదిలా ఉంటే.. అస్సాం సీఎం విలీనం వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉండగానే.. ఆయన బంగ్లాదేశ్‌ విలీనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పర్యటనలో ఉన్న ఆమె ఇప్పటికే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కూడా. అంతేకాదు ఇరు దేశాల మధ్య ఏడు ఎంవోయూలపై సంతకాలు కూడా జరిగాయి. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం హసీనా సోమవారం భారత్‌కు వచ్చారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో ఆమె భేటీ అయ్యారు.

Exit mobile version